Bloody Ishq OTT: క్యూట్ బ్యూటీ అవికా గోర్ ప్రేక్షకులను భయపెట్టాలని కంకణం కట్టుకున్నట్లుంది. ఈ మధ్య ఆమె వరుసగా భయపెట్టే సినిమాలు, వెబ్ సిరీస్ లలోనే నటిస్తోంది. గత ఏడాది ఆమె నటించిన ‘మ్యాన్షన్ 24’, ‘వధువు’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆట్టుకున్నాయి. ‘1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ మూవీ ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆమె తాజాగా నటించిన ‘బ్లడీ ఇష్క్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విక్రమ్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వర్ధన్ పూరి మరో మెయిన్ రోల్ పోషిస్తున్నాడు.
జులై 26న హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్
త్వరలో ‘బ్లడీ ఇష్క్’ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్, ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జులై 26 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అవికా గోర్ ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ఊపిరి బిగబట్టుకుని ఈ సినిమా కోసం వెయిట్ చేయాలని చెప్పింది. ‘బ్లడీ ఇష్క్’ సినిమాకు మహేష్ భట్, సుహ్రితా దాస్ స్టోరీ అందించారు. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించాయి. మహేష్ భట్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సమీర్ టాండన్, ప్రతీ వాలియా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.
‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్
ఇక అవికా గోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన పల్లెటూరి అమాయకపు అమ్మాయిలా అదిరిపోయే నటనతో అందరినీ అలరించింది. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకోవడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘తను నేను’, ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’ సహా పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ వరుసగా హారర్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను భయపెడుతోంది.
Read Also: విడాకుల పోస్టుకు లైక్ కొట్టిన అభిషేక్ బచ్చన్, అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్