'జాయ్ ల్యాండ్' (Joyland - Pakistan Movie)... ఈ పేరుతో ఒక సినిమా ఉందని, వచ్చిందని కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు వచ్చే వరకూ భారతీయ ప్రేక్షకులకు తెలియదేమో! అదొక పాకిస్తాన్ సినిమా కాబట్టి తెలిసే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. కాన్ (Cannes Film festival 2022)లో అవార్డులతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. 'అన్ సెర్టైన్' విభాగంలో కాన్ జ్యూరీ అవార్డుతో పాటు ఉత్తమ ఎల్‌జిబిటి సినిమాగా మరో అవార్డు అందుకుంది. అసలు, ఈ సినిమాకు రెండు అవార్డులు ఎందుకిచ్చారు? ఈ సినిమా ప్రత్యేకత ఏంటి?


పాకిస్తాన్ పేరు చెబితే కొందరికి తీవ్రవాదం కళ్ళ ముందు మెదులుతుంది. వివిధ దేశాల్లో తీవ్రవాదులు సాగించిన మారణకాండ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, గాయాలు ప్రేక్షకులకు ఇంకా గుర్తే. మరికొందరికి ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి గుర్తుకు వస్తుంది. నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న, చదువు కోసం పోరాడిన మలాలా కొందరికి గుర్తు రావచ్చు. మలాలా లాంటి పాకిస్తానీ ప్రజలకు? తమ దేశంలో మతపరమైన ఆంక్షలు, ఆంక్షల వల్ల గాయపడిన హృదయాలు గుర్తుకు రావచ్చు.


ఒక్కటి మాత్రం నిజం... పాకిస్తాన్‌లో మతపరమైన ఆంక్షలు ఎక్కువ. ఇస్లాంను అనుసరించే పాలకులు, మత గురువులు (ఇమామ్), తీవ్రవాదుల నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే? మలాలాకు ఎదురైన ఘటనలకు ఎదురు కావచ్చు. అటువంటి గడ్డ మీద శృంగార చర్చకు తావిచ్చే సినిమా తీయడం సాహసమే. అటువంటి సాహసాన్ని దర్శకుడు సయీమ్ సాధిఖ్ చేశారు.


'జాయ్ ల్యాండ్' గురించి చెప్పాలంటే... ట్రాన్స్‌వుమ‌న్ (ట్రాన్స్ జెండర్)తో పెళ్ళైన పురుషుడు ప్రేమలో పడితే ఏం జరిగింది? అనేది సినిమా. ఇందులో దర్శకుడు చాలా అంశాలను చర్చించారు. లాహోర్‌లో మధ్య తరగతి కుటుంబ జీవితాలు, అక్కడి డ్యాన్సర్ల రిహార్సిల్స్, సామాజిక స్థితిగతులు, శృంగార పరమైన పరిస్థితులు - పలు అంశాలను సయీమ్ సాధిఖ్ స్పృశించారు.


ట్రాన్స్‌వుమన్‌తో ప్రేమలో పడిన హీరో... ఆమె కటౌట్‌ను ఇంటికి తీసుకొస్తాడు. ఆ పని కుటుంబ సభ్యులకు నచ్చదు. మరో సన్నివేశంలో బాత్‌రూమ్ కిటికీ నుంచి పొరుగింట్లో ఉంటున్న పురుషుడిని బైనాక్యులర్స్ సహాయంతో చూస్తుంది హీరో భార్య. మతపరమైన, సాంప్రదాయ కట్టుబాట్లకు... మోడ్రన్ సెక్సువల్ ఫ్రీడమ్‌కు మధ్య సంఘర్షణను సినిమాలో చూపించారు. ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి సున్నితమైన అంశాన్ని, వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించిన సినిమా 'జాయ్ ల్యాండ్'. వినోదాత్మకంగా సాగుతూ భావోద్వేగాలను చూపించింది. తండ్రి కుమారుల మధ్య సంబంధాలను, కుమారులపై తండ్రి అజమాయిషీని చూపించారు.





 కాస్టింగ్ పరంగానూ 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకమని చెప్పాలి. సినిమాలో ట్రాన్స్‌వుమ‌న్‌ 'బిబా'గా నటించినది రియల్ లైఫ్ ట్రాన్స్‌వుమ‌న్‌ అలీనా ఖాన్. ఆమెకూ తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది.






కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి పాకిస్థాన్ సినిమా 'జాయ్ ల్యాండ్'. కాన్‌లో అవార్డు అందుకున్న తొలి పాకిస్తాన్ సినిమా కూడా ఇదే. దర్శకుడు సయీమ్ సాధిఖ్ తీసిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ దర్శకుడు తీసిన షార్ట్ ఫిల్మ్ 'డార్లింగ్' వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకుంది.


Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?


పాకిస్తాన్‌లో హిందీ సినిమాలకు ఆదరణ బావుంటుంది. ఖాన్ హీరోలు సల్మాన్, షారుఖ్, ఆమిర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతోన్న పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ అవార్డులు ఊపిరి ఇస్తాయని చెప్పవచ్చు.


Also Read: 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహా ఓటీటీలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?