యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులకు గుడ్ న్యూస్. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఈ రోజు సూపర్ అప్డేట్ ఇచ్చారు. మార్చి 23న సినిమా ముహూర్త కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఆ రోజు పూజ చేయడంతో పాటు చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం.

  


ఎన్టీఆర్, కొరటాలది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా, వరల్డ్ సక్సెస్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ హిట్  సినిమాలైన 'బృందావనం'కి రచయితగా, 'జనతా గ్యారేజ్'కు దర్శకుడిగా కొరటాల పని చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోంది.


Also Read : పెళ్లి తర్వాత వివక్ష, తారకరత్న గుండెల్లో బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు - అలేఖ్య వివాదాస్పద పోస్ట్






ఫ్యాన్స్‌ను టీజ్ చేసిన ఎన్టీఆర్
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అక్కడ ఈ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడిగితే ఎన్టీఆర్ టీజ్ చేశారు. ''ఏంటి అబ్బాయ్! నెక్స్ట్ సినిమా నేనేమీ చేయడం లేదు. (నవ్వుతూ...) ఎన్నిసార్లు చెప్పాలి!? మొన్నే చెప్పాను కదా! త్వరలో మొదలు అవుతుంది, ఆగండి. మీరు అలా అడుగుతుంటే... నెక్స్ట్ సినిమా చేయడం లేదని చెప్పేస్తా. ఆపేస్తాను కూడా! మీరు (సినిమాలు) ఆపమన్నా... నేను ఆపలేను. ఒకవేళ నేను ఆపేసినా మీరు ఊరుకోరు. ఆ సినిమా గురించి చెప్పడానికి ఇది సరైన వేదిక కాదు. త్వరలో చెబుతా'' అని అభిమానులతో సరదాగా స్పందించారు. 'దాస్ కా ధమ్కీ' వేడుకలో కొత్త సినిమా అప్డేట్ ఇవ్వడం సరికాదని చెప్పిన ఎన్టీఆర్, మరుసటి రోజు కొత్త కబురు చెప్పారు. 


ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్
ఎన్టీఆర్ జోడీగా ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తెలుగులో జాన్వీకి తొలి చిత్రమిది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. 


కల్పిత దీవి... ఒక పోర్టులో
హీరోగా ఎన్టీఆర్ 30వ సినిమా ఇది. అందుకని #NTR30 గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.


ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. 


Also Read : విశ్వక్ సేన్ నాకంటే ఎక్కువ వాగుతాడు, నేనే సైలెంట్ అయిపోయా - ఎన్టీఆర్


నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.