మైకులో విశ్వక్ సేన్ (Vishwak Sen) మాట్లాడినట్టు తాను ఎప్పటికీ మాట్లాడలేనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. మనోడికి ఉండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాజిబుల్ అన్నారు. ఎన్టీఆర్ (Jr NTR)కి విశ్వక్ సేన్ వీరాభిమాని. గతంలో పలుసార్లు తన అభిమాని చాటుకున్నారు. అభిమాని సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఆయన హీరోగా నటించడమే కాదు... దర్శకత్వం కూడా వహించారు. మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ (Das Ka Dhamki Pre Release) వేడుక నిర్వహించారు. లాస్ ఏంజిల్స్, అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుక నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హాజరైన తొలి వేడుక ఇది. అందులో విశ్వక్ సేన్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే...
విశ్వక్ సేన్ ఎనర్జీ బాల్ - ఎన్టీఆర్
విశ్వక్ సేన్ ఎనర్జీ బాల్ అని ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేనే ఎక్కువ వాగుతాను. నా కంటే ఎక్కువ విశ్వక్ సేన్ వాగుతాడు. నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినే స్టేజికి నన్ను తీసుకుని వెళ్లిపోయాడంటే మీరు ఊహించుకోండి'' అని సరదాగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు రావడం తన బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.
మూడ్ ఆఫ్ అయితే విశ్వక్ సినిమా చూస్తా - ఎన్టీఆర్
తనకు బాగా ఇష్టమైన చిత్రాలు చాలా తక్కువ ఉంటాయని, వాటిలో విశ్వక్ సేన్ నటించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ముఖ్యమైనదని ఎన్టీఆర్ తెలిపారు. ''నాకు మూడ్ ఆఫ్ అయిపోయినా, కొంచెం టెన్షన్స్ లోకి వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తా. అందులో 'ఈ నగరానికి ఏమైంది' ఇంపార్టెంట్. ఆ సినిమాలో విశ్వక్, అభినవ్... వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోవచ్చు. ముఖ్యంగా విశ్వక్ కామెడీ చేయకుండా కామెడీ పండించాడు. ఆ సినిమాలో ఎంత కామెడీ పండించాడో... అంతే బాధను లోపల దిగమింగుకుని ఉంటాడు. నటుడిగా ఆ సీన్స్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. 'ఈ నగరానికి ఏమైంది' తర్వాత 'ఫలక్ నుమా దాస్' చూశా. దానికి డైరెక్షన్ కూడా చేశారు. నటుడిగా ఎంత కాన్ఫిడెన్స్ చూపించాడో... దర్శకుడిగా కూడా అంతే కాన్ఫిడెంట్ గా చేశాడు'' అని ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
యాటిట్యూడ్ పెట్టుకుని చేంజ్ అయిపోతాడా?
'పాగల్' చూసిన తర్వాత విశ్వక్ సేన్ ఒక ఇమేజ్ ఛట్రంలోకి వెళుతున్నాడేమో అనుకునానని ఎన్టీఆర్ అన్నారు. అయితే, 'అశోక వనంలో అర్జున కళ్యాణం' చూసిన తర్వాత ఇంత యాటిట్యూడ్ పెట్టుకుని అంత చేంజ్ అయిపోతాడా? అనిపించిందన్నారు. విశ్వక్ ఇంత పరిణితి చెందేశాడా? అని షాక్ అయ్యానని, 'హిట్' చూసి ఇంకా షాక్ అయ్యానని ఎన్టీఆర్ తెలిపారు. తనకు తాను ఏదో ప్రూవ్ చేసుకోవాలని బయలు దేరిన నటుడు విశ్వక్ అన్నారు.
'దాస్ కా ధమ్కీ'తో విశ్వక్ సేన్ డైరెక్షన్ ఆపేయాలి - ఎన్టీఆర్
'దాస్ కా ధమ్కీ' బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఆ తర్వాత విశ్వక్ సేన్ డైరెక్షన్ ఆపేయాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. కొత్త దర్శకులకు విశ్వక్ లాంటి వాళ్ళు అవకాశాలు ఇవ్వాలని, తమ లాంటి హీరోలు ఆ దర్శకులను చూసి వాళ్ళతో సినిమాలు చేయాలన్నారు. 'దాస్ కా ధమ్కీ' సినిమాకు ఉన్నదంతా పెట్టేశానని విశ్వక్ సేన్ చెప్పాడని, సినిమా అంటే అతనికి అంత పిచ్చి అని ఎన్టీఆర్ చెప్పారు.
Also Read : మళ్ళీ ఆస్కార్ కొడతాం - స్టేజిపై ఇద్దరు తెలుగోళ్ళు కనిపించారు, కిక్ ఇచ్చే ఎన్టీఆర్ స్పీచ్
తన క్లోజ్ ఫ్రెండ్, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి అబ్బాయి బాపినీడు 'అశోక వనంలో అర్జున కళ్యాణం' చిత్రాన్ని నిర్మించాడని, ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావాలి కానీ, కుదరలేదని ఎన్టీఆర్ తెలిపారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై విశ్వక్ సేన్ తండ్రి 'కరాటే' రాజు 'దాస్ కా ధమ్కీ' నిర్మించారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. 'ధమాకా' విజయం తర్వాత ఆయన సంభాషణలు రాసిన చిత్రమిది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు, సంగీతం : లియోన్ జేమ్స్.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల 'పాప' ఎలా ఉందంటే?