కన్నడ నటుడు అయిన దేవరాజ్(Actor Devaraj) తెలుగు చిత్రాల్లోనూ నటించారు. మెగాస్టార్ చిరంజీవి 'ఎస్పీ పరశురామ్', నట సింహం బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', 'సమరసింహారెడ్డి', కింగ్ నాగార్జున 'నేటి సిద్ధార్థ', గోపీచంద్ 'యజ్ఞం', 'లక్ష్యం' సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను'లో ప్రతిపక్ష పార్టీ నేత పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే... దేవరాజ్ తనయుడు తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు.
దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ (Pranam Devaraj) తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'వైరం' (Vairam Movie). సాయి శివం జంపాన దర్శకత్వం వహించారు. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ పతాకాలపై జె. మల్లికార్జున నిర్మిస్తున్నారు. సినిమా కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాయి. కాశీ విశ్వనాథ్, బెనర్జీ టీజర్ విడుదల చేశారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి సంస్థ లోగోను దేవరాజ్, చంద్ర దేవరాజ్ ఆవిష్కరించారు.
నా కుమారుడినీ ఆదరించండి - దేవరాజ్
''తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు హీరోగా వస్తున్న నా కుమారుడిని, ఈ సినిమా అదే విధంగా ఆదరించాలని కోరుకుంటున్నా. కన్నడలో టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు టీజర్ సైతం బాగుంటుందని చెబుతున్నారు. సంతోషంగా ఉంది. KGFలో నటించిన 'గరుడ' రామ్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. త్వరలో విడుదల కానున్న సినిమాను సైతం ఆదరించాలని కోరుకుంటున్నా'' అని దేవరాజ్ చెప్పారు. ''నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించినట్టు... 'వైరం'తో నన్నూ ఆదరించాలని కోరుకుంటున్నా'' అని హీరో ప్రణం దేవరాజ్ చెప్పారు.
తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రమిది
''దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో దేవరాజ్ గారికి చెప్పాం. కథపై నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన ఆయనకు, ప్రణం దేవరాజ్ గారికి థాంక్స్. సినిమా బాగా వచ్చింది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని చిత్ర నిర్మాత జె. మల్లికార్జున అన్నారు. ''తెలుగులో, కన్నడలో... రెండు భాషల్లో తీసిన ద్విభాషా చిత్రమిది. ప్రణం దేవరాజ్ హీరోగా నటించడం సంతోషంగా ఉంది. 'గరుడ' రామ్ ఈ సినిమా చేస్తారా? లేదా? అనుకున్నా. ఆయనకు కథ నచ్చి చేశారు. అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది'' అని చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన చెప్పారు.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల 'పాప' ఎలా ఉందంటే?
ప్రణం దేవరాజ్, మోనల్ జంటగా, విన్ను మద్ది పాటి, 'గరుడ' రామ్, కాశీ విశ్వనాథ్, శత్రు, 'చమ్మక్' చంద్ర, భద్రం తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూర్పు : అజయ్ ఎం కుమార్, కళ : రవి కుమార్ ఎం, ఛాయాగ్రహణం : సామల భాస్కర్, సహ నిర్మాతలు : అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు, సంగీతం : మహతి స్వర సాగర్, నిర్మాత : జె. మల్లికార్జున, దర్శకుడు : సాయి శివన్ జంపాన.
Also Read : అమెరికా నుంచి ఢిల్లీకి రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం