India vs Australia, 1st ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో మొదటి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా వచ్చారు. రజనీకాంత్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి రజనీకాంత్ ఫోటోను ట్వీట్ చేసింది. దీనిలో రజనీకాంత్, ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలేతో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.






ఇక మ్యాచ్ విషయానికి వస్తే... ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిషెల్ మార్ష్ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించలేదు.


రెండో ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌‌ను (5: 10 బంతుల్లో, ఒక ఫోర్) మహ్మద్‌ సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. మంచి లెంత్‌లో పడిన బంతిని మిడిల్‌ చేసేందుకు ట్రావిస్ హెడ్‌ ప్రయత్నించాడు. అయితే బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి నేరుగా వికెట్లను లేపేసింది.


మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రం సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కాస్త నిలదొక్కుకున్నాక చక్కని షాట్లు బాదేశాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. అతడికి స్టీవ్‌ స్మిత్‌ (22; 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా రవీంద్ర జడేజా విడదీశాడు.


ఆ తర్వాత మార్నస్ లబుషేన్‌ (15: 22 బంతుల్లో, ఒక ఫోర్) అండతో మార్ష్‌ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆపై ఎడాపెడా బాదేసి స్కోరు వేగం పెంచాడు. దాంతో 16.4 ఓవర్లకు ఆసీస్‌ 100 పరుగుల మైలురాయి అధిగమించింది. జట్టు స్కోరు 139 వద్ద మార్నస్ లబుషేన్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ బుట్టలో పడేశాడు. చక్కని లెంగ్తులో వచ్చిన బంతిని డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించిన మార్షన్ లబుషేన్‌ కుదరకపోవడంతో గాల్లోకి ఆడేశాడు. దానికి రవీంద్ర జడేజా డైవ్‌ చేసి ఒడిసిపట్టాడు.


మరో 10 పరుగులకే మార్ష్‌ను జడేజా అవుట్‌ చేశాడు. సిక్సర్‌ బాదే క్రమంలో బ్యాటు అంచుకు తగిలిన బంతి థర్డ్‌మ్యాన్‌ వైపు లేచింది. దానిని మహ్మద్ సిరాజ్‌ పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా 139 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.


అయితే ఆ తర్వాత వచ్చిన జాన్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్ కాసేపు బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అయితే వీరు అవుటయ్యాక ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో 169 పరుగులకు నాలుగు వికెట్లతో కనిపించిన ఆస్ట్రేలియా కేవలం 19 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది.


మహ్మద్ షమీ, సిరాజ్ ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ వెన్ను విరిచారు. దీంతో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.