యుగ పురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు (NT Rama Rao) శత జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు అందరూ ఆయన్ను స్మరించుకున్నారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. చిత్ర సీమలో ఆయన నెలకొల్పిన రికార్డులను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేలకు పైగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగినట్టు సమాచారం. అది పక్కన పెడితే... హైదరాబాద్ సిటీలో 'ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్'లో చోటు దక్కింది.
ఎన్టీఆర్ శత జయంతి నాడు 101మందికి సత్కారం
గత నెల (మే) 28న ఎన్టీ రామారావు జయంతి (NTR Jayanthi). ఎఫ్‌టిపిసి (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సంస్థ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుక నిర్వహించింది. చిత్రసీమతో పాటు సామాజిక, ఆరోగ్య, వ్యాపార రంగాల్లో విశిష్ఠ ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించి ఎన్టీఆర్ ఖ్యాతిని మరొక్కసారి యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడీ అవార్డు వేడుక రికార్డులకు ఎక్కింది.
ఎంతో సంతోషంగా ఉంది - మురళీ మోహన్
''ఎఫ్‌టిపిసి నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుక (NTR Birth Anniversary Celebrations) వేడుక 'వరల్డ్ బుక్ అఫ్ లండన్ రికార్డ్స్'లో చోటు సంపాదించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఆనందం కలుగుతోంది" అని సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇంతటి వైభవం ఇతర నటులు ఎవరికీ దక్కదని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే అన్నగారి జయంతి రోజు రెండు వందల వేడుకలు జరిగాయని తెలిసింది. 'ఇది కదా చరిత్ర' అనిపించింది. వరల్డ్ బుక్ అఫ్ లండన్ రికార్డ్స్ లక్ష్యంగా అంగరంగ వైభవంగా ఎఫ్‌టిపిసి సంస్థ ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుక నిర్వహించి... అన్నగారి ఖ్యాతిని మరొక్క సారి యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ఈ సందర్భంగా ఎఫ్‌టిపిసి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, సెక్రటరీ వీస్ వర్మ పాకలపాటికి నా అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డును అందజేసిన 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ ఇండియా' ప్రతినిధులు రాజీవ్ శ్రీ వాత్సవ్, టీఎస్ రావు, ఆకాంక్ష షాలకు నా ప్రత్యేక అభినందనలు'' అని చెప్పారు.
Also Read : 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
ఎన్టీఆర్ జయంతికి కొన్ని రోజుల ముందు హైదరాబాద్ సిటీలో ఆయన వారసులు, నందమూరి కుటుంబ సభ్యులు భారీ సభ నిర్వహించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య, సుమంత్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. హీరోలతో పాటు ఎన్టీ రామారావుతో పని చేసిన దర్శక, నిర్మాతలను ఘనంగా సత్కరించారు. ఆ కార్యక్రమానికి అభిమానులు వేలాది సంఖ్యలో విచ్చేశారు. అంగ రంగ వైభాగంగా ఆ వేడుక జరిగింది.
Also Read : చిరంజీవి ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంత కథ నడిచిందా? ఆసక్తికర విషయాలు చెప్పిన నిర్మాత