తమిళనాడుకు చెందిన ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ అధినేత, సినీ దర్శకుడు సీమాన్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సీనియర్ నటి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు సంగతి తెలిసిందే. ఈ కేసులో సీమాన్‌ కు వల్సరవాక్కం పోలీసులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. 


తమిళ దర్శక నటుడు సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ, నటి విజయలక్ష్మి 2020 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తన జీవితాన్ని నాశనం చేశాడంటూ అదే ఏడాది జూలైలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవల ఆమె మరోసారి సీమాన్ పై సంచలన ఆరోపణలు చేయడంతో లైంగిక వేధింపుల ఫిర్యాదు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 


కొద్దిరోజుల క్రితం గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్ళి సీమాన్‌ (NTK party leader Seeman) పై ఫిర్యాదు చేసింది విజయలక్ష్మి. ఆ తర్వాత తిరువళ్లూరు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం రికార్డ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీమాన్‌ తనను శారీరకంగా వాడుకున్నారని, తన బంగారు నగలు తీసుకుని మోసం చేశాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రేమిస్తున్నట్లు నటించి తనను 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. 2011లోనే అతనిపై ఫిర్యాదు చేశానని, అయితే తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో వెనక్కి తీసుకున్నానని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరితే NTK పార్టీ అధినేత చంపేస్తానని బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపింది. 


విజయలక్ష్మి కంప్లెయింట్ తో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. 12 ఏళ్లకు ముందు అత్యాచారం, బెదరింపు, మోసం వంటి ఐదు సెక్షన్ల కింద సీమాన్ పై కేసు నమోదు చేశారు. సీమాన్‌ సహచర్యం వల్ల తనకు ఏడుమార్లు అబార్షన్‌ జరిగిందని విజయలక్ష్మి చెప్పడంతో, నగరంలోని కీల్పాక్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీమాన్‌ ను విచారించేందుకు సన్నాహాలు చేపట్టారు. 


Also Read: 2024 క్లాష్ ఆఫ్ సీక్వెల్స్: 'ఇండియన్ 2', 'సింగం 3' లతో ఫైట్ కు రెడీ అంటున్న 'పుష్ప 2'


కోయంబత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీమాన్‌కు సమన్లు జారీ చేసేందుకు పోలీసులు వెళ్లారు. అప్పుడే ఆయన్ను అరెస్టు చేస్తారని వదంతులు వచ్చాయి కానీ, చివరి క్షణంలో సమన్లు జారీ చేయకుండా పోలీసులు తిరిగొచ్చారు. అయితే శనివారం ఉదయం స్థానిక పాలవాక్కం శక్తిమూర్తి అమ్మన్‌ నగర్‌లో బస చేస్తున్న సీమాన్‌ ఇంటికి వెళ్లి సమన్లు అందించారు. ఈనెల 12న తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 


కాగా, 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్‌ ప్రారంభించింది నటి విజయలక్ష్మి. ఫస్ట్ సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం, దేవదూతన్‌ వంటి దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులో 'హనుమాన్ జంక్షన్‌', 'పృథ్వీ నారాయణ' వంటి చిత్రాల్లో విజయలక్ష్మి కీలక పాత్రలు పోషించింది.


2007 మార్చిలో నటుడు సృజన్ లోకేష్‌ తో విజయలక్ష్మి ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అయితే ఊహించని విధంగా ఆ నిశ్చితార్థం బ్రేకప్‌ అయింది. ఆ తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి.. సీమాన్‌ పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. మరోవైపు సీమాన్‌ కి 2013లో పెళ్లయింది. అతనికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో ఆయన తమిళ నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీని ప్రారంభించాడు. అప్పటి నుండి సామాజిక సమస్యలపై వివాదాస్పద ప్రకటనల కోసం తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.


Also Read: తలైవా తగ్గేదేలే - మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన రజనీ!





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial