Agent: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం 'ఏజెంట్'.. ఏప్రిల్ 28 న విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ ను మూటగట్టుకుంది. మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల నటన ఇతర అంశాలు.. ఏవీ ప్రేక్షకులను, అక్కినేని ఫ్యాన్స్ ను అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. వినోదాత్మకంగా చూడగలిగేలా ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు కూడా. అయితే ఇప్పుడు 'ఏజెంట్‌' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


'ఏజెంట్' సినిమాలో టైటిల్ రోల్‌లో అఖిల్ అక్కినేని నటించాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ముందుగా ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ ను అనుకున్నారట. దర్శకుడు సురేందర్‌రెడ్డి కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. రామ్ చరణ్ అప్పటికే 'ఆర్ఆర్ఆర్(RRR)', 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్‌' లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నందున ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు.


ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా నటించలేదు. కానీ అఖిల్‌కు తన వంతు మద్దతు మాత్రం ఇచ్చాడు. అంతే కాదు 'ఏజెంట్‌' సినిమాను కూడా ప్రమోట్ చేశాడు. అందులో భాగంగానే అఖిల్, రామ్‌ చరణ్ ల 1 నిమిషం ప్రోమో వీడియోను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. 'ధృవ X ఏజెంట్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో.. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ సినిమాలోని పోలీస్ క్యారెక్టర్‌తో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్‌కు ఫోన్ చేసి.. ‘ఏజెంట్ ఎక్కడువన్నావ్’ అంటే దగ్గరలోనే ఉన్నానని సమాధానం వస్తుంది. అందరూ నీ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు సిద్ధమేనా? అని అడగ్గా.. ఇది నా వైల్డెస్ట్ మిషన్, నేను రెడీ అని బదులిస్తాడు ఏజెంట్. ఇక ‘ధృవ’.. ‘లెట్స్ బిగిన్ ది వైల్డ్ రైడ్’ అంటూ థియేటర్లలో ఏజెంట్ బిగ్ టికెట్ ఓపెనింగ్స్ ప్రారంభించారు. 'ఏజెంట్' రిలీజ్ కు కొన్ని రోజుల ముందు రిలీజ్ చేసిన ఈ వీడియో..  అక్కినేని, మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది కూడా.


రామ్ చరణ్, ఇతర స్టార్స్ కలిసి 'ఏజెంట్' కోసం పలు విధాలుగా ప్రమోషన్స్ చేసినప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. ఇక రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నిర్మాతకు దాదాపుగా రూ. 50 కోట్ల వరకు నష్టం మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ సినిమాను ముందు అనుకున్నట్టుగా రూ.40 కోట్ల బడ్జెట్ తో చేసి ఉంటే నష్టం కాస్త తగ్గేదని మరికొందరు నిట్టూరుస్తున్నారు.


ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ లు అవ్వడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ తాజా అప్ డేట్ తో మరోసారి నొక్కి చెబుతున్నారు. ఇంతకుముందు 'ఓకే బంగారం', 'సూర్య సన్నాఫ్ కృష్ణణ్', 'కృష్ణార్జున యుద్ధం', 'నేల టిక్కెట్', 'ఎటో వెళ్లిపోయింది మనసు'.. ఈ సినిమాలను రామ్ చరణ్ గతంలో రిజెక్ట్ చేశారు. అనుకోకుండా ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నష్టాన్నే మిగల్చడం గమనార్హం.


Read Also: కర్నాటకలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం, ప్రాణ స్నేహితుడి గెలుపు కోసం కష్టపడుతున్న కామెడీ బ్రహ్మ!