కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మే 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వం జోరుగా కొసాగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. విజయమే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి కోసం బ్రహ్మీ ఎన్నికల ప్రచారం
కర్నాటక ఎన్నికల ప్రచారంలో సినీ తారలు సైతం పాల్గొంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఎలెక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం రంగంలోకి దిగారు. చిక్ బళ్లాపూర్ బీజేపి అభ్యర్థి సుధాకర్ కి మద్దతుగా ఆయన ఈ ప్రచారం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి సుధాకర్ ను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. వాస్తవానికి చిక్ బళ్లాపూర్ నియోజక వర్గంలో చాలామంది తెలుగు వారు ఉంటారు. అక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడేవారే ఉంటారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం అక్కడ తెలుగులోని ప్రసంగించారు.
సుధాకర్ ను గెలిపిస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు- బ్రహ్మానందం
వైద్యశాఖ మంత్రిగా పేదలకు మెరుగైన వైద్యం అందడంలో అహర్నిశలు శ్రమిస్తున్న సుధాకర్ కు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు. “వైద్యశాఖ మంత్రిగా సుధాకర్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యేలా ప్రయత్నించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆయన కృషి చేస్తున్నారు. వైద్యరంగంలో కర్ణాటక గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశారు సుధాకర్. ఆయనకు ప్రజలంతా ఓటు వేయాలని కోరుతున్నాను. ఆయన మంచి తనం, ఆయన సేవా గుణం చూసి తన తరఫున ప్రచారం కోసం వచ్చాను. చాలా మంది సినీ నటుడు ఆయన కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మరోసారి ఓటు వేసి గెలిపిస్తే కర్నాటకలో వైద్యరంగం మరింత బాగుపడుతుంది. అందుకే ఆయనను గెలిపించండి” అని బ్రహ్మానందం స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా బ్రహ్మానందం సుధాకర్ కోసం ప్రచారం చేశారు. ఉదయం మొదలైన ఆయన ప్రచారం రాత్రి వరకు కొనసాగింది. ప్రచారం అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు.
గతంలోనూ సుధాకర్ తరఫున ప్రచారం చేసిన బ్రహ్మీ
వాస్తవానికి బ్రహ్మానందం తెలుగు రాష్ట్రా రాజకీయాల గురించి ఏనాడు పెద్దగా మాట్లాడలేదు. ఏ పార్టీకి సపోర్టు చేయలేదు. కానీ, కర్నాటకలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం వెనుక ఓ కారణం ఉంది. వాస్తవానికి సుధాకర్ తరఫును బ్రహ్మానందం ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాదు. 2019 లో కూడా ఆయన కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా సుధాకర్ గెలుపుకోసం క్యాంపెయిన్ చేశారు. బ్రహ్మానందం, సుధాకర్ మధ్య సుదీర్ఘ స్నేహం ఉంది. వీరిద్దరు ప్రాణ స్నేహితులు కూడా. అందుకే ఆయన తరఫున బ్రహ్మీ ప్రచారం చేశారు. ఇప్పటికే అధికార బీజేపీ కన్నడ సూపర్ స్టార్ సుదీప్‌ని తమ ప్రచారం కోసం నియమించుకుంది. పలువురు అభ్యర్థులు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఎన్నికల ప్రచారం కోసం ఆహ్వానిస్తున్నారు.
Read Also: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది, నేరుగా థియేటర్లలోనే విడుదల - తెలుగు రాష్ట్రాల్లో నయా రికార్డ్!