పురుషుల్లో రొమ్ములు పెరగడం అనేది చాలా తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. బొద్దుగా ఉన్నాం కదా అందుకే రొమ్ములు కూడా పెరుగుతున్నాయి అనుకుని వైద్యులను సంప్రదించకుండా ఉండకూడదు. మగవారిలో రొమ్ములు పెరగడం అనేది తీవ్రమైన కాలేయ సమస్యను సూచిస్తుంది. కొవ్వుల జీవక్రియ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడానికి బాధ్యత వహించేది కాలేయం. ఇది శరీరంలోని అనేక ఇతర విధులను కూడా నిర్వర్తిస్తుంది. ఈ కీలకమైన అవయవం దెబ్బతింటే శరీరం కుదేలవడం ఖాయం. కాలేయ సమస్యలు చిన్న చిన్న లక్షణాలను బయటపెడతాయి. ప్రాథమిక స్థాయిలోనే ఈ లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకుంటే సమస్యలు రావు. చాలామంది మగవారు రొమ్ములు పెరగడాన్ని  తేలిగ్గా తీసుకుంటారు. పురుషులలో రొమ్ము కణజాలం పెరగడం అనేదాన్ని వైద్య పరిభాషలో ‘గైనకోమాస్టియా’ అని పిలుస్తారు. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన సమస్య కావచ్చు.


ఈస్ట్రోజన్ ప్రభావం..
ఈస్ట్రోజన్ అనేది సెక్స్ హార్మోన్. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తుంది. రొమ్ములు పెరగడానికి కారణం అవుతుంది. మగవారిలో రొమ్ములు పెరగడానికి కూడా ఇదే కారణం. కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడిన పురుషుల్లో అడ్రినల్ గ్రంధుల్లో హార్మోన్ల ఉత్పత్తి అధికమవుతుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుదలను పెంచుతుంది. ఇది కూడా కాలేయ వ్యాధికి కారణం అవుతుంది.


రొమ్ముల పెరుగుదలలో కాలేయం పాత్ర ఉందని చెబుతున్నారు వైద్యులు. అవసరంలేని అదనపు ఈస్ట్రోజన్ ను విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి బయటికి పంపడం కాలేయం విధి. కాలేయం సరిగా పనిచేయకపోతే ఎర్రబడి, కొవ్వును విచ్చిన్న చేయడంలో  విఫలమవుతుంది. దీనివల్ల ఈస్ట్రోజన్ పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ సందర్భంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా తినే పురుషుల రక్తంలో తక్కువ టెస్టోస్టోరాన్ స్థాయిలు ఉంటాయి. ఈస్ట్రోజన్ పేరుకుపోవడం, టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల రొమ్ములు పెరగడం ప్రారంభమవుతుంది. 


ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. ఇది ఆల్కహాల్ తాగే వారిలోనూ వస్తుంది. ఆల్కహాల్ తాగని వారిలోనూ వస్తుంది. ఆల్కహాల్ తాగే వారిలో వస్తే దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఆల్కహాల్ తాగని వారిలో వస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. 


దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. విపరీతంగా అలసిపోతారు. 
2. బరువు విపరీతంగా తగ్గిపోతారు. 
3. పొట్టలో విపరీతమైన నొప్పి వస్తుంది. అది కూడా కుడివైపు అధికంగా వస్తుంది. 
4. బలహీనంగా మారిపోతారు. 
5. చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. 
6. చర్మంపై దురద పెడుతుంది. 
7. పొట్ట, పాదాలు, కాళ్లు, చీలమండలలో వాపు వస్తుంది. 



Also read: చేపలు కచ్చితంగా తినాలని వైద్యులు చెప్పడానికి కారణాలు ఇవే














































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.