అగ్ర దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి తెలుగులో స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొంత మంది దర్శకులకు చేతి నిండా సినిమాలు ఉంటున్నాయి. మరి కొందరు దర్శకులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆల్రెడీ ఓకే చేసిన కథలు, సినిమాలు పక్కన పెట్టిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఆ జాబితాలోని ఇద్దరు దర్శకులకు, ముఖ్యంగా మెగా హీరోలు హ్యాండ్ ఇచ్చిన దర్శకులకు యువ హీరో నితిన్ (Nithiin) ఛాన్సులు ఇచ్చారని టాలీవుడ్ టాక్. 


చిరంజీవి సినిమా క్యాన్సిల్ అయితే!
'ఛలో' సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఆయన నటుడిగా కొన్ని ప్రయత్నాలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'తుఫాన్' (హిందీ సినిమా 'జంజీర్') లో చిన్న రోల్ చేశారు. 'ఛలో' తర్వాత నితిన్ హీరోగా 'భీష్మ' తీసి హిట్ కొట్టారు. ఆయన మెగా అభిమాని. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిచి ఛాన్స్ ఇవ్వడంతో సంతోష పడ్డారు. కానీ, ఆ ఆనందం ఎన్నో రోజులు నిలబడలేదు. చిరు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలోని వెంకీ కుడుముల సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగింది. 


చిరంజీవి సినిమా ఆగడంతో ఖాళీ అయిన వెంకీ కుడుములకు నితిన్ అవకాశం ఇచ్చారని తెలిసింది. ఆల్రెడీ తనకు 'భీష్మ' వంటి విజయం ఇవ్వడంతో ఛాన్స్ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించినట్టు లేరు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. 


అల్లు అర్జున్ 'ఐకాన్' లేదు గానీ!
ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. నిజం చెప్పాలంటే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తీసిన తర్వాత మరో సినిమా ఓకే చేయించుకోవడానికి వక్కంతం వంశీకి చాలా టైమ్ పట్టింది. స్టార్ హీరోలు బిజీగా ఉండటంతో ఆఖరికి నితిన్ దగ్గరకు వచ్చారు.


Also Read : మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ఫ్యామిలీ


అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయలేదు గానీ... అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమాకు దర్శకుడిగా వేణు శ్రీరామ్ పేరు చాలా రోజులు వినబడింది. అది సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చేశారు. ఆ సినిమా తర్వాత 'ఐకాన్' ఉంటుందని అనుకుంటే... అది పక్కకి వెళ్ళింది. ఆ దర్శకుడికి కూడా నితిన్ ఛాన్స్ ఇచ్చారు.


ఉగాదికి సినిమా ప్రకటన!
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేయనున్నారని సమాచారం. నూతన తెలుగు సంవత్సరాది ఉగాదికి సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తారని టాక్. వేసవిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. కొన్ని రోజులు ఈ సినిమా, మరి కొన్ని రోజులు వెంకీ కుడుముల సినిమా షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట. అన్నట్టు... నితిన్ కూడా మెగా ఫ్యాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఎంత అభిమానం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్, నితిన్ మంచి స్నేహితులు. 


Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ