నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘అంటే సుందరానికి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది నాని కెరీర్ లో 31వ చిత్రం. శనివారం ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. అనౌన్స్ మెంట్ వీడియోని వదిలారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని 'అన్‌చైన్‌డ్' పేరుతో ఈరోజు (అక్టోబర్ 23) ఉదయం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. 


గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్లే, #Nani31 చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో నాని రెండు చేతులకు సంకెళ్లతో బందీగా ఉన్నాడు. అయితే అతను తన బలాన్నంతా ఉపయోగించి ఆ సంకెళ్లు తెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ కనిపిస్తున్నాడు. 'అతను సంకెళ్లు తెంచుకొని, జయించటానికి సిద్ధంగా ఉన్నాడు' అని మేకర్స్ పేర్కొనగా.. ''పేరు: సూర్య, రోజు: శనివారం.. సరిపోదా? ఆయుధపూజతో ఆరంభం'' అని హీరో నాని ట్వీట్ చేసారు. 


‘సరిపోదా శనివారం’ టైటిల్ గ్లింప్స్ లోకి వెళ్తే, ''మన పెద్దలు ఒక మాట అనేవాళ్ళు.. రాజుకైనా బంటుకైనా ఎలాంటి వాడికైనా ఒకరోజు వస్తుంది.. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అని. అదే మాటని మన కొత్తతరం కుర్రాళ్ళు ఇంకొంచం మార్చి.. 'నీకంటూ ఒక టైం వస్తుందిరా, అందాకా మూసుకొని వెయిట్ చెయ్' అన్నారు. ఇప్పుడు మన కథ ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ళ గురించో, ఆ మాటని మార్చిన ఈతరం వాళ్ళ గురించో కాదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ తరం వాడైనా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే ఆ ఒక్క రోజు గురించి. అలాంటి రోజు, ఆ ఒక్కరోజు ఒకడికి వారానికి ఒకసారి వస్తే.. వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా.. అనుకున్నా ఆపగలరా.. శనివారం.. ప్రతీ శనివారం.. సరిపోదంటారా?'' అంటూ డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇంటెన్స్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 


Also Read: 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసేశా, మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే: బాలకృష్ణ 


ఇందులో నాని ఒంటి నిండా గాయాలతో ఒక చీకటి గదిలో బంధించబడి ఉన్నాడు. అక్కడి తప్పించుకోడానికి వేచి చూస్తున్న అతను.. శనివారం రోజు గొలుసులను తెంచుకొని, తలుపులు బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. మరోవైపు కొందరు జనాలు వర్షంలో తడుస్తూ ఎవరి కోసమో తీక్షణంగా ఎదురుచూస్తుండగా.. ఫేస్ కనిపించకుండా ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చిన నానిని చూసి వారి ముఖాలు వెలిగిపోయాయి. తమని కాపాడటానికి వచ్చిన వీరుడు అతడే అనే విధంగా చూస్తుండటంతో ఈ వీడియో ముగిసింది.



‘సరిపోదా శనివారం’ టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. టైటిల్ చూసి ఇదేదో ‘అంటే సుందరానికి’ తరహాలో క్లాస్ మూవీ అనుకొని పొరపాటు పడొద్దని దర్శకుడు అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఓవైపు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, మరోవైపు నానిని ఎందుకు బంధించాల్సి వచ్చింది? ప్రతీ శనివారం అతనికి ఏం జరుగుతుంది? అని కథ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా ఈ వీడియోని కట్ చేసారు. కాకపోతే టైటిల్ గ్లింప్స్ చూసి 'మహావీరుడు' 'మిన్నల్ మురళి' లాంటి కంటెంట్ తో రాబోతున్నాడేమో అనే సందేహాలు కలగకమానవు. ఏదైతేనేం నాని, వివేక్ ఆత్రేయ కలిసి ఈసారి తమని తాము సరికొత్త జోనర్ లో ప్రెజెంట్ చేసుకోబోతున్నారనేది స్పష్టం అవుతోంది. గతంలో థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ కాంబో, ఈసారి థ్రిల్ కు గురి చేయబోతున్నట్లు అర్థమవుతోంది. 


‘సరిపోదా శనివారం’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందని టైటిల్ గ్లింప్స్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించనుంది. దర్శక నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్ర పోషించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చనున్నారు. మురళి జి సినిమాటోగ్రాఫర్ గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్‌ 24 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి. 


Also Read: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అనారోగ్యం బారినపడిన బాల్య మిత్రుడి కోసం ఏం చేశారంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial