జాతీయ చలన చిత్ర అవార్డులను భారతీయ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ అవార్డును అందుకోవాలని దేశ వ్యాప్తంగా సినీ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి కోరుకుంటారు. ప్రతి ఏటా ప్రకటించే ఈ అవార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా 2021 ఏడాదికి గాను 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్లు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.


10 అవార్డులు దక్కించుకున్న తెలుగు చిత్రాలు


గతంలో చెప్పుడూ లేని విధంగా ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు దూసుకెళ్లాయి. ఏకంగా 10 అవార్డులను దక్కించుకుని ఔరా అనిపించాయి. ఆస్కార్ వేదికపై రెండు అవార్డులు దక్కించుకున్న ‘RRR’ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 6  విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై సత్తా చాటారు. ‘పుష్ప’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు ఏ తెలుగు నటుడిగా దక్కని అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు.  ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్‌ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.   ఇక ‘కొండపొలం’ చిత్రానికి గాను ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ అవార్డును సాధించారు.  మొత్తంగా ఈసారి తెలుగు చిత్రాలు జాతీయ అవార్డుల పంట పండించాయి.   


అవార్డు గ్రహీతలకు ఏం ప్రదానం చేస్తారంటే? 


⦿ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న వారికి ఏం ఇస్తారు? ఎంత నగదు బహుమతి అందిస్తారు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందిస్తారు. అయితే, జ్యూరీ అభినందించిన చిత్రాలకు మాత్రం కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు నగదు బహుమతి అందిస్తారు.


⦿ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా ఇతర అవార్డులు అందుకున్న నటీనటులు, టెక్నీషియన్లకు రూ.50 వేల నగదు బహుమతితో పాటు రజత కమలాన్ని అందిస్తారు.


⦿ ఈ సారి ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటిమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌ రూ. 50 వేల నగదు బహుమతితో పాటు రజత కమలాన్ని అందుకుంటారు. ప్రశంసా పత్రం లభిస్తుంది.


⦿ బెస్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌ రూ. 2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం పొందుతారు.


⦿ బెస్ట్ మూవీగా ఎంపికైన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీకి రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు.


⦿ ఉత్తమ వినోద చిత్రంగా అవార్డుకు ఎంపికైన ‘RRR’ రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది.


⦿ జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన ‘షేర్షా’ మూవీ రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలం పొందనున్నాయి.


⦿ ఉత్తమ  జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన  ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు రూ. 1.50 లక్షల నగదు, రజత కమలం అందజేయనున్నారు.   


నాన్ ఫీచర్ కేటగిరీ విజేతలు ఏం ఇస్తారంటే?


ఇక నాన్ ఫీచర్ విభాగంలో అవార్డులు దక్కించుకున్న చిత్రాలకు కాస్త తక్కువ ప్రైజ్ మనీ అందిస్తారు. నాన్ ఫీచర్ కేటగిరీ బెస్ట్ మూవీకి రూ. 1.5 లక్షల నగదుతో పాటు స్వర్ణకమలం అందిస్తారు. ఉత్తమ దర్శకుడికి రూ. 1.50 లక్షల నగదు బహుమతి ఇస్తారు. నాన్ ఫీచర్ విభాగంలో అవార్డులు అందుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు రూ. 50 నగదుతో పాటు రజత కమలం అందిస్తారు. 


Read Also: ‘ఉప్పెన’ కథ వినగానే చిరంజీవి అలా అన్నారు - నేషనల్ ఫిల్మ్ అవార్డుపై దర్శకుడు బుచ్చిబాబు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial