ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మన తెలుగు సినిమాల గురించి మాట్లాడే స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. గత ఏడాది విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్', 'పుష్ప' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేశాయో ఒక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిల్లో 'ఆర్ ఆర్ ఆర్' కి ఆస్కార్ అవార్డు వస్తే, 'పుష్ప' మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి ఈ సక్సెస్ఫుల్ మూవీస్ పై ఓ బాలీవుడ్ సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరెవరో కాదు నసీరుద్దీన్ షా.
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నసీరుద్దీన్ షా. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప', 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు తాను ఈ చిత్రాలు చూడలేదని అన్నారు. ఆ సినిమాల్లో థ్రిల్ చేసే అంశాలు తప్పితే ఏముందో అర్థం కాదని చెప్పారు. అంతేకాదు సినిమాల్లో హీరోయిజాన్ని మరింత ఎక్కువగా చూపించడం ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోయింది అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి.
"ఈ మధ్యకాలంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అమెరికాలోని మార్వెల్ యూనివర్స్ చిత్రాలు సైతం ఇదే తరహాలో ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి మన ఇండియాలోనూ కనిపిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్', 'పుష్ప' చిత్రాలను ఇప్పటివరకు నేను చూడలేదు. ఇలాంటి సినిమాలను చూసి థ్రిల్ కాకుండా ప్రేక్షకులు ఇంకేం పొందుతారో నాకు తెలియదు. మణిరత్నం తెరకెక్కించిన కొన్ని 'పొన్నియన్ సెల్వన్' చూశాను. ఆయన గొప్ప దర్శకుడు. ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారు" అని తెలిపారు.
అదే సమయంలో యంగ్ ఫిలిం మేకర్స్ పై ప్రశంసలు సైతం కురిపించారు. రాంప్రసాద్ కి తెహర్వి, గుల్ మెహర్ వంటి చిత్రాలకు సరైన గౌరవం దక్కాలి అని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ సందర్భంలో 'గదర్ 2', 'కేరళ స్టోరీ', 'కాశ్మీర్ ఫైల్స్' వంటి సినిమాలను ఆయన వ్యతిరేకించారు. వీటిల్లో 'కేరళ స్టోరీ', 'గదర్ 2' సినిమాలను తాను చూడలేదని, కానీ ఆ సినిమాల గురించి తెలుసు అని అన్నారు. అంతే కాకుండా ‘కాశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాకి అంత పాపులారిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని చెప్పారు. ఇక ఇప్పుడు 'పుష్ప', 'ఆర్ ఆర్ ఆర్' వంటి సినిమాలను నసీరుద్దీన్ షా వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక నసిరుద్దీన్ షా విషయానికొస్తే.. 'నిశాంత్' అనే సినిమాతో మొదటిసారి నటుడిగా వెండితెరపై మెరిసారు. ఆ తర్వాత 'చక్ర', 'బజార్', 'హోలీ', 'మిర్చ్ మసాలా', 'కర్మ', 'బొంబాయి బాయ్స్' వంటి ఎన్నో సినిమాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. కేవలం హిందీలోనే కాకుండా కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు. 1987లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు .
Also Read : 'స్కంద'కి సీక్వెల్ - థియేటర్స్‌లో సర్ప్రైజ్ చేసిన బోయపాటి, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!