ఫ్యాన్ వార్స్ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి. ఇటీవల నాని వర్సెస్ విజయ్ దేవరకొండ అన్నట్లు కొంత మంది మధ్య ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్ జరిగింది. విజయ్ దేవరకొండ‌ పైకి రాకుండా అతడిని తొక్కేసే ప్రయత్నాలు నాని చేస్తున్నారని ఒక సెక్షన్ నెటిజన్స్ పోస్టులు చేయగా... నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. ఇది దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టి వరకు వెళ్లింది. తాజాగా ఈ ఫ్యాన్ వార్ మీద ఆయన స్పందించారు.


విజయ్ దేవరకొండకు నాని సపోర్ట్ చేశారు!
విజయ్ దేవరకొండకు నాని సపోర్ట్ చేసే వారిని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. నేచురల్ స్టార్, రౌడీ బాయ్ కలిసి నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఆ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మార్చి 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నాగ్ అశ్విన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ గురించి ప్రశ్న ఎదురైంది. 


''ఇటీవల మేం ఒక వీడియో విడుదల చేశాం. 'ఎవడే సుబ్రమణ్యం' టీం అంతా రీ యూనియన్ లా కలిశాం. అప్పుడు నాని, విజయ్ దేవరకొండ కలిశారు. ఆ వీడియో విడుదల చేశాక వాళ్ళిద్దరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఉన్నట్టు చూశా. మేం సినిమా చేసేటప్పుడు విజయ్ దేవరకొండకు నాని చాలా సపోర్ట్ చేశాడు. నాకు గుర్తు ఉంది... ప్రతి సన్నివేశాన్ని విజయ్ దేవరకొండతో నాని డిస్కస్ చేసేవాడు. ఇద్దరూ చాలా ఈజీ గోయింగ్ పీపుల్. ఇద్దరికీ తమ కెరీర్ పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వెరీ యాంబిషియస్ పర్సన్స్'' అని నాగ్ అశ్విన్ చెప్పారు.


'ఎవడే సుబ్రమణ్యం' తరువాత నాగ్ అశ్విన్ 'మహానటి', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు కల్కి సీక్వెల్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ మీద ఉన్నారు. ఇప్పుడు గనుక 'ఎవడే సుబ్రమణ్యం' లాంటి సినిమా తీయగలరా? లేదా దానికి సీక్వెల్ తీయగలరా? అంటే ప్రస్తుత మైండ్ సెట్ బట్టి అటువంటి సినిమా రాదేమోనని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు గనక తీస్తే టెక్నికల్ పరంగా అప్డేటెడ్ వెర్షన్ రావచ్చన్నట్లు చెప్పుకొచ్చారు.


Also Read: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్


'మీ తొలి సినిమాకు కమర్షియల్ అంశాలు చూడకుండా 'ఎవడే ఎవడే సుబ్రమణ్యం' కథను ఎంచుకోవడానికి కారణం ఏమిటి?' అని ప్రశ్నించగా... ''నిజానికి నేను రెండు కమర్షియల్ కథలు రాశా. వైజయంతి సంస్థలో కూడా చెప్పాను. కానీ అవి టేక్ ఆఫ్ కాలేదు. అటువంటి సమయంలో చిన్న ఇండిపెండెంట్ ఫిలిం చేద్దామని 'ఎవడే...' కథ రాయడం మొదలు పెట్టాను. నిజానికి ఈ సినిమాను ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారని అనుకోలేదు. నానికి, స్వప్నకి, ప్రియాంకకి అందరికి నచ్చింది. దాంతో టేక్ ఆఫ్ అయింది'' అని నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చారు. 'ఎవడే సుబ్రమణ్యం'కు సీక్వెల్ చేయలేమని, ఆ సినిమా ఇంటర్వెల్‌లో ఏం జరుగుతుందో ప్రేక్షకులు అందరికీ తెలుసని, అయితే ఆ సినిమాకు ప్రీక్వెల్ రాయొచ్చని నాగ్ అశ్విన్ వివరించారు.