విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? పనిగట్టుకుని మరి పీఆర్ టీం చేత అతని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నాడా? తనకు పోటీ వస్తాడని, టైర్ 2 హీరోలలో తనకు కాంపిటీషన్ అవుతాడని సైడ్ లైన్ చేయిస్తున్నాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఇది. అసలు ఎందుకు మొదలైంది? దీని వెనుక ఎవరున్నారు? ఏమిటి రచ్చ? వంటి వివరాల్లోకి వెళితే...
నాని వర్సెస్ విజయ్ దేవరకొండ...
ఫ్యాన్స్ మధ్య మంట పెట్టిన యూట్యూబర్!
సోషల్ మీడియాలో నాని మీద విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమ హీరోని తొక్కేస్తున్నారంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. నాని మీద దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ చూసిన నాని ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్ మొదలవడానికి కారణం ఏమిటి? అని చూస్తే...
ఒక యూట్యూబర్, ప్రతి వారం విడుదలయ్యే సినిమాల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రివ్యూవర్ గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి... మూడేళ్ల నుంచి ఒక హీరో మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుందని దీని వెనుక మరొక టైర్ 2 హీరో ఉన్నాడని కామెంట్స్ చేశాడు. దాంతో విజయ్ దేవరకొండ మీద నాని నెగిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. అది కాస్త ట్రోలింగ్ వరకు వెళ్ళింది.
దేవరకొండను తొక్కాల్సిన అవసరం నానికి ఉందా?
విజయ్ దేవరకొండను తొక్కాల్సిన అవసరం నానికి ఉందా? నిజంగా యంగ్ హీరోలు తనకు కాంపిటీషన్ వస్తున్నారని నాని బలంగా భావిస్తున్నారా? అంటే... 'అసలు లేదు' అని చెప్పాలి.
విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపుల'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కంటే ముందు అతడు హీరోగా చేసిన సినిమాలు కాస్త ఆలస్యంగానే థియేటర్లలోకి వచ్చాయి. అయితే, 'పెళ్లి చూపులు'కు ముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో తన స్నేహితుడు పాత్రలో నటించే అవకాశం విజయ్ దేవరకొండకు వచ్చింది. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన నాగ్ అశ్విన్, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ మధ్య అప్పట్లో స్నేహం ఏర్పడింది. అలా ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే... దర్శకుడికి మొదటి సినిమా అయినప్పుడు హీరో ఓకే అంటేనే ఛాన్స్ ఇచ్చేది. అప్పటికి నాని ఎష్టాబ్లిష్డ్ హీరో. హిట్స్ కొట్టిన హీరో. విజయ్ దేవరకొండకు మొదటి గుర్తింపు రావడంలో నాని పాత్ర ఉందని చెప్పాలి.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ విడుదల చేసింది నాని. ఆ వేడుకలో నానికి రౌడీ హీరో ముద్దు కూడా పెట్టాడు. విజయ్ దేవరకొండ మాత్రమే కాదు... ఎవరి సినిమా విజయం సాధించినా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నాని. ఒక హీరో నెగిటివ్ పబ్లిసిటీ చేయించడం వల్ల మరొక హీరోకి ఫ్లాప్స్ వస్తున్నాయని చెప్పడంలో అర్థం లేదు. హిందీలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన సినిమాల మీద అక్కడ ప్రముఖులు విపరీతమైన ద్వేషం వెళ్లగక్కిన సందర్భాలు కోకొల్లలు. అయినా సరే అతని సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి.
Also Read:ప్రభాస్ - ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఆ అమ్మాయే... ఫస్ట్ మూవీ ఫ్లాపైనా ఫుల్ ఆఫర్స్!
యంగ్ హీరోలను సపోర్ట్ చేయడంలో నాని ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వాల్ పోస్టర్ సినిమా సంస్థలో నిర్మించిన 'హిట్'లో విశ్వక్ సేన్ హీరో అయితే... ఆ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండో సినిమాలో అడివి శేష్ హీరో. ఇప్పుడు 'హిట్ 3'లో కూడా శేష్ నటిస్తున్నారు. హీరోలను తొక్కేయాలని నాని అనుకుంటే 'మేజర్' ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శేష్ రోల్ 'హిట్ 3'లో కట్ చేయాలి కదా! ఈ లాజిక్ ఎలా మర్చిపోయారో నానిని ట్రోల్ చేసే వాళ్ళు! యూట్యూబర్ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్ వంటి హీరోలకు నాని సపోర్టు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడారు నాని. వైసిపి అనుచరులు తనను ట్రోల్ చేసినా సరే ఆయన వెనకడుగు వేయలేదు. ఎవరో ఒక యూట్యూబర్ చేసిన కామెంట్స్ పట్టుకుని ఇండస్ట్రీకి అండగా నిలబడే నాని మీద ట్రోల్ చేయడం తగదని చెప్పాలి.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?