Just In





Nandamuri Kalyan Ram: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ - బాబాయ్‌తో కలిసి నటించడంపై కల్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Arjun Son Of Vyjayanthi Pre Release: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ S/O వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కానున్నారు.

Kalyan Ram's Arjun S/O Vyjayanthi Movie Pre Release Event: కలియుగ దైవం వెంకటేశుని ఆశీస్సులు ఉంటే బాబాయ్‌తో కలిసి నటిస్తామని టాలీవుడ్ టాప్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా, లేడీ పవర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈ నెల 18న రిలీజ్ కానుంది.
శ్రీవారి సేవలో మూవీ టీం
ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు విజయశాంతి, మూవీ దర్శక నిర్మాతలు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్
సినిమా విడుదలకు ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నామని కల్యాణ్ రామ్ అన్నారు. తల్లి ప్రాముఖ్యత ఏంటో మా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ చూస్తే తెలుస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 12న ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని.. ఈ ఈవెంట్‌కు తమ్ముడు ఎన్టీఆర్ హాజరవుతారని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అమ్మ కథే..
అంతకు ముందు సాంగ్ రిలీజ్ వేడుకలో కల్యాణ్ రామ్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. 'ఓ కుటుంబంలో అమ్మ, నాన్న, ఓ అబ్బాయి ఉంటారు. అమ్మ గృహిణి కాగా నాన్నది చిరు వ్యాపారం. అమ్మ పిల్లాడి కోసం కష్టపడుతూ ప్రతీ రోజూ ఉదయాన్నే అన్నీ రెడీ చేస్తుంది. అయితే, ప్రతీ దానికీ అమ్మపై చిరాకు పడే కొడుకు ఆమెపై తండ్రికి కంప్లైంట్ ఇస్తాడు. అమ్మ టార్చర్ పెడుతుందని చెబుతాడు. అంతా విన్న తండ్రి.. నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉన్న అమ్మ చిరునవ్వు చిందించేది.
పురిటి నొప్పుల సమయంలో ఎంతో నరకం అనుభవించినా.. నీకు జన్మనివ్వగానే స్వర్గంలోకి వెళ్లినంత ఆనందించింది. నీకు ప్రాణం పోసేందుకు తన ప్రాణాలు సైతం లెక్కచేయలేదు. తండ్రి మాటలతో కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లి ఆమెను హత్తుకుంటాడు. ఆ క్షణంలో అమ్మ ఆనందం మాటల్లో వర్ణించలేం. ఇదే మా 'అర్జున్ సన్నాప్ వైజయంతి' మూవీ.' అని కల్యాణ్ రామ్ తెలిపారు.
ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి. ప్రదీప్ చిలుకూరి సినిమాకు దర్శకత్వం వహించగా ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.