Vicky Kaushal's Chhaava OTT Release On Netflix: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' (Chhaava). ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'ఛావా' ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఓటీటీ ఆడియన్స్‌తో పాటు మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ ఈ నెల 11 నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన 'ఛావా' ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని సినీప్రియులు అంటున్నారు.
రికార్డు కలెక్షన్లు
శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక తమ నటనతో మెప్పించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని దినేశ్ విజన్ నిర్మించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన 'ఛావా' రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది.
సినిమాలో అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతేష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ కన్నీళ్లు, స్లోగన్స్‌తో బయటకు వచ్చారు. ఫిబ్రవరి 14న మూవీ రిలీజ్ కాగా చాలా రోజుల వరకూ థియేటర్లలో హిస్టారికల్ మేనియా కనిపించింది.
స్టోరీ ఏంటంటే?
ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కుట్రలు పన్నుతాడు. వీరి ఆలోచనలకు చెక్ పెట్టేలా శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్).. వారిపై ఎదురుదాడికి దిగుతాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో యుద్ధఛాయలు అలుముకుంటాయి. కోశాగారంపై దాడి గురించి తెలుసుకున్న ఔరంగజేబు శంభాజీని ఎదుర్కొనేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు.
సైనికులు, ఆయుధాల పరంగా తమ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన మొఘల్ సామ్రాజ్యం మీద శంభాజీ ఏ విధంగా యుద్ధం చేశాడు? వారిపై విజయం కోసం ఎలాంటి వ్యూహాలు రచించాడు? ఇదే సమయంలో శత్రుసైన్యంతో చేతులు కలిపి శంభాజీకి ద్రోహం చేసింది ఎవరు?, శంభాజీ మొఘల్ సైన్యానికి చిక్కిన తర్వాత ఆయన భార్య యేసుబాయి (రష్మిక) ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.