Happy Birthday Nandamuri Balakrishna: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా గుర్తింపు సాధించుకున్నారు బాలకృష్ణ. ఆయనను ఫ్యాన్స్ అంతా ప్రేమగా బాలయ్య, ఎన్‌బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు పొలిటీషియన్‌గా ఎన్నో విజయాలను చూశారు బాలకృష్ణ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఆయన సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. పైగా.. తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో ఉన్నారు. ఈ సారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ..
1960 జూన్ 10న జన్మించిన బాలయ్య కెరీర్ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. సీనియర్ ఎన్‌టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించారు బాలకృష్ణ. ఆయన పుట్టడం, పెరగడం అంతా మద్రాసులోనే జరిగింది. తండ్రి పెద్ద హీరో అవ్వడంతో చిన్నప్పటి నుంచే ఆయనకు సినీ పరిశ్రమను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. అందుకే ఆయన కూడా హీరో అవ్వాలని కలలు కనడం మొదలుపెట్టారు. 1974లో తనకు 14 ఏళ్ల వయసులో తన తండ్రి ఎన్‌టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కథ’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటిసారి వెండితెరపై వెలిగారు బాలయ్య. ఇక 1980ల్లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లను అందుకున్నారు బాలయ్య. ‘సాహసమే జీవితం’, ‘మంగమ్మగారి మనవడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాలు 1980ల్లోనే విడుదలయ్యి ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఎన్నో అవార్డులు..
చారిత్రక పాత్రలు పోషించడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అని పేరు తెచ్చుకున్నారు. ‘వేములవాడ భీమకవి’లో భీమకవిగా, ‘దాన వీర శూరకర్ణ’లో అభిమాన్యుడిగా, ‘ఆదిత్య 369’లో కృష్ణదేవరాయగా, తన 100వ చిత్రమైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గౌతమీపుత్ర శాతకర్ణిగా అందరినీ మెప్పించారు బాలయ్య. ఆయన ఇన్నాళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారు. ‘నరసింహ నాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల్లో ఆయన నటనకు నంది అవార్డులు వరించాయి. ‘నరసింహ నాయుడు’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘మువ్వ గోపాలుడు’, ‘ఆదిత్య 369’లో హీరోగా ఆయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న బాలయ్య.. 2014లో రాజకీయాల్లోకి కూడా ఎంటర్ అయ్యారు.
సామాజిక కార్యక్రమాలు..
సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రస్తుతం ఆయన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకొని బాలయ్య అంటే పేరు కాదు, అదొక బ్రాండ్‌గా మార్చుకున్నారు. స్క్రీన్‌పైన ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీకి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్. అంతే కాకుండా ఆయనను ఇమిటేట్ చేస్తూ రీల్స్ కూడా చేస్తుంటారు. బాలయ్య.. ఫ్యాన్స్‌పై క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి, మరోసారి హిందూపురంకు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు బాలయ్య.
Also Read: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్... NBK109 సెకండ్ వీడియో గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్!