యువ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ 'రంగబలి'. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే తొలి రోజే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉందని, సెకండాఫ్ నిరాశ పరిచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. దీనికి హీరో నాగశౌర్య, దర్శకుడు పవన్‌ బాసంశెట్టి, హీరోయిన్ యుక్తితరేజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శౌర్య మీడియాకి క్షమాపణలు చెప్పారు. 


'రంగబలి' సినిమా ప్రమోషనల్స్ లో భాగంగా కమెడియన్ సత్యతో ఓ స్పూఫ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పలువురు మీడియా వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యతో సత్య చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో ఈ ఇంటర్వ్యూ వల్ల కొందరు హార్ట్ అయ్యారనే టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని శౌర్య వద్ద ప్రస్తావించగా.. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని అనుకోలేదని అన్నారు. స్పూఫ్ ఇంటర్వూ ఎవరి క్యారెక్టర్లతో అయితే చేసామో, వారంతా బానే వున్నారని.. మిగిలిన వారే వాళ్లేదో ఫీలయ్యారని ప్రచారం చేసి, ఆ ఇంటర్వూను వైరల్ చేసారన్నారు.


‘మీడియాపై సెటైర్‌ వేయాలని ఎందుకు అనిపించింది?’ అని అడగ్గా, నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మీడియా మేమూ ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలానే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ డూప్‌ లను పెట్టి వీడియోలు చేస్తారు. మేము మా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎవరినీ హర్ట్ చేయకుండా, అందరికీ తెలిసిన వ్యక్తులను ఎంపిక చేసుకొని.. ఒక హీరోను వాళ్లు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అని సరదాగా చేశాం. ఇందులో ఎవరినీ ఎగతాళి చేయలేదు.. అసలు చేయాలని అనుకోలేదు'' అని అన్నారు. 


''మేము ఏదీ అనుకుని చేయలేదు. ఒకవేళ మా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే, నిజంగా నన్ను క్షమించండి. సారీ చెప్పడానికి నాకు ప్రాబ్లమ్ ఏమీ లేదు. అది అనుకుని చేయలేదు.. అనుకోకుండా అయిపోయింది. నన్ను క్షమించండి'' అని నాగశౌర్య అన్నారు. ''మేం ఏది చేసినా థియేటర్ కు ప్రేక్షకులను తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే. మీరు ఏది రాసినా అది ప్రజలు చూడాలనే ప్రయత్నం మీది (మీడియా). దాంట్లో మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, మేం అంతే నిజాయితీగా ఉంటాం. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని మేము ఏ రోజూ ఆలోచించలేదు. చాలా మందితో మాట్లాడాం. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరూ హర్ట్ అవ్వలేదు. కానీ ఒకరిద్దరు బాధపడ్డారు అని వేరే వాళ్లు ప్రచారం చేయడం వల్ల అది ఫేమస్ అయింది’’ అని శౌర్య చెప్పుకొచ్చారు.


Also Read: Baby Trailer: 'మొదటి ప్రేమకు మరణం లేదు' - హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'బేబీ'


ఇదే అంశం మీద దర్శకుడు పవన్ మాట్లాడుతూ.. ''నిజంగా స్పూఫ్ ఇంటర్వ్యూ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ. చిన్నప్పటి నుంచి మనం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సినిమాలు చూసి, మనం హీరోల్లా ఫీలవుతాం. ఇంటర్వ్యూ కూడా అలాంటిదే. మేము చాలా పాజిటివ్ గా, వారి మీద అభిమానంతో చేసిన ప్రయత్నమే తప్ప, వారి మీద సెటైర్ వెయ్యాలని, బాధ పెట్టాలని చేసింది కాదు'' అని అన్నారు. 


ఇకపోతే సెకండాఫ్ సీరియస్‌ గా ఉందన్న కామెంట్స్‌పై దర్శకుడు మాట్లాడుతూ.. ''ఫస్టాఫ్‌ హిలేరియస్ గా ఉంది. సెకండాఫ్ లో కూడా సత్య క్యారెక్టర్‌తో కామెడీ చేయించవచ్చు. కానీ అప్పుడు నేను రాసుకున్న కథకు న్యాయం చేయలేను. నా కథకు ఏం కావాలో అదే చెప్పాలనుకున్నాను. ఆడియన్స్ కు నచ్చాలని కామెడీ పెట్టలేదు. కథకు సరిపోయింది కాబట్టే పెట్టాను. ఒకవేళ సెకండాఫ్ లో ఫన్ పెడితే, 'అంత పెద్ద టైటిల్‌ పెట్టుకుని ఇంత ఫన్నీగా ఎలా తీశారు? కథలో సీరియస్ నెస్ లేదు' అంటారు. సెకండాఫ్ కూడా స్లోగా అందరికీ నచ్చుతోంది. ఫస్టాఫ్ హిలేరియస్ గా పండటం వల్లే సెకెండాఫ్ సీరియస్ గా ఉందని అనుకుంటున్నారు’’ అని విశ్లేషించారు.


దీనిపై నాగశౌర్య మాట్లాడుతూ.. "సెకండాఫ్ లో తప్పులేదు. ఫస్టాఫ్ లో మరీ కామెడీ డోస్ ఎక్కువైపోయింది. అదే తప్పు. సెకెండాఫ్ లో ఎక్కడా ల్యాగ్ లేదు. కంటెంట్ చూపించాం. ఒకవేళ కంటెంట్ లేకుండా కేవలం నవ్వించమని చెప్పండి.. మేం మామూలుగా నవ్వించం. కానీ మేం ఇక్కడున్నది కేవలం నవ్వించడానికి కాదు. ఒక కథ చెప్పాలనుకున్నాం. జనాలకు మంచి చెప్పడం కోసం మేం మా వంతు ప్రయత్నం చేసాం. ఇవన్నీ వద్దు అడల్ట్ కంటెంటే కావాలి, పిచ్చి పిచ్చి కామెడీనే కావాలంటే మా దగ్గర బొచ్చెడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. మేం ఆడియన్స్ ను చెడగొట్టాలని అనుకోలేదు" అని అన్నారు.


Also Read: Project-K: ఐడల్ ప్రభాస్‌తో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను - అమితాబ్ బచ్చన్ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial