Nizam Distributor For Hari Hara Veera Mallu: వీరమల్లు విడుదలకు మూడు రోజుల ముందు ఒక విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. తెలుగు సినిమా వసూళ్లకు ఎంతో కీలకమైన తెలంగాణ ఏరియాలో డిస్టిబ్యూషన్ ఎవరు చేస్తారనే కన్ఫ్యూజన్‌కు తెర పడింది.
మైత్రి చేతికి వీరమల్లు నైజాం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాను నైజాంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్‌కు అనుబంధ సంస్థ మైత్రి డిస్టిబ్యూషన్ పంపిణీ చేయబోతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.
వీరమల్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ గురించి కొన్ని రోజులుగా డైలమా నెలకొంది. ఒక దశలో నిర్మాత 'దిల్' రాజు పేరు కూడా వినిపించింది. పవన్ నటించిన పలు సినిమాలను ఇంతకు ముందు ఆయన తెలంగాణ ప్రాంతంలో విడుదల చేశారు. 'తొలిప్రేమ' సినిమాతోనే పంపిణీదారుడిగా తాను నష్టాల నుంచి బయట పడినట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నైజాం ఏరియాలో మరో బిగ్ డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ సైతం వీరమల్లు పంపిణీ కోసం ప్రయత్నించారట. ఆయన చెప్పిన రేటు తక్కువగా ఉందని టాక్. అందువల్ల ఇవ్వకూడదని నిర్మాత రత్నం డిసైడ్ కావడంతో గతంలో తమకు రావలసిన బాకీల గురించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ, అలాగే ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్న సూర్యదేవర నాగావంశీ పేరు కూడా వినిపించింది. ట్రైలర్ విడుదల తర్వాత నిర్మాత రత్నాన్ని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది ఉన్నారు. అయితే చివరకు మైత్రి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది అలాగే సినిమా మీద బజ్ ఉంది. తెలంగాణ ఏరియాలో దిల్ రాజు ఏషియన్ సునీల్ వంటి డిస్ట్రిబ్యూటర్లకు పోటీ ఇవ్వడానికి గత కొన్ని రోజులుగా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలను సైతం తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు.