Director Jyothi Krishna About HHVM Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యోధుడిగా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు పవన్. ట్రైలర్ చూస్తేనే హైప్ పదింతలు కాగా... ఇక మేకింగ్ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ పక్కా.
మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 'హరిహర వీరమల్లు' గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ, ప్రొడ్యూసర్ ఎఎం రత్నం తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వార్ సీక్వెన్స్ కోసం పవన్ చాలా శ్రమించారని జ్యోతికృష్ణ తెలిపారు.
పవన్ డిజైన్ చేసిన ఫైట్
ఈ మూవీలో ఓ ఫైట్ ఎపిసోడ్‌ను పవన్ డిజైన్ చేశారని... ఆయన ఫైట్స్ డిఫరెంట్‌గా ఉంటాయని తెలిపారు జ్యోతికృష్ణ. 'పవన్ కల్యాణ్ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రతీ దానిలో ఆయన మార్షల్ ఆర్ట్స్ స్కిల్ కనిపిస్తుంది. సినిమాలో ఫైట్స్ దేనికవే చాలా స్పెషల్. ఓ ఫైట్ ఎపిసోడ్‌ను స్వయంగా పవనే డిజైన్ చేశారు. దాదాపు 60 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. డూప్స్ కాకుండా పవన్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారు. బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్'ను తలపించే ఫైట్ సీన్ అది. ఆ వార్ సీక్వెన్స్ చూస్తే ఆడియన్స్‌కు గూస్ బంప్స్ పక్కా.
4 రకాల వెపన్స్‌తో వార్ సీక్వెన్స్ కోసం పవన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. విదేశీ స్టంట్ మాస్టర్లతో పాటు పీటర్ హెయిన్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని ఓ పవర్ ఫుల్ రోల్‌లో పవన్‌ను చూడబోతున్నాం.' అని చెప్పారు.
Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
పవన్ డైరెక్ట్ చేయాల్సిన మూవీ!
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'హరిహర వీరమల్లు' ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రొడ్యూసర్ ఎఎం రత్నం తెలిపారు. తన సినీ జర్నీలో ఇదే సుదీర్ఘ ప్రయాణమని... కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్‌తో గతంలో 'సత్యాగ్రహి' మూవీ నిర్మించాలని ప్లాన్ చేశాను. ఆ మూవీని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయాలని అనుకున్నారు. ఏఆర్ రెహమాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నాం. టైటిల్ అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలతో మూవీని ప్రారంభించాం. కానీ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది.
'సత్యాగ్రహి' సినిమా చేసుంటే సూపర్ హిట్ అయ్యేది అని పవన్‌తో ఇటీవల అన్నాను. 'అవును ఆ సినిమా సూపర్ హిట్ అయితే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌లా మూవీస్ చేస్తూ ఉండేవాడిని. పాలిటిక్స్‌లోకి వచ్చే వాడిని కాదు.' అని పవన్ అన్నారు.' అని రత్నం చెప్పారు. అటు, ఐదేళ్ల సినీ ప్రయాణం తనలో మార్పు తీసుకొచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు.
ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుండగా... ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేయనున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా... దర్శక ధీరుడు రాజమౌళి, ఇతర సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.