ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా 'మీటర్'తో వచ్చేందుకు రెడీ అయ్యాడు. రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన ‘మీటర్’ సినిమా టీజర్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ టీజర్ ను చూస్తుంటే సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ఒక బాధ్యతలేని పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. డ్యూటీ పై ఆసక్తి లేకుండా, డ్యూటీని చేయాలని లేకున్నా చేస్తున్నట్లు కనిపిస్తున్న హీరో చుట్టూ తిరిగే కథతో ‘మీటర్’ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ టీజర్ లో కిరణ్ అబ్బవరం పాత్ర సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న 'మీటర్' సినిమా టీజర్ విడుదల అయ్యింది.. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
తన గత చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసిన విషయం తెల్సిందే. అల్లు అరవింద్ ఆ సినిమాను సమర్పించడంతో మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘మీటర్’ సినిమాను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ తో కలిసి నిర్మించడం జరిగింది. కథా బలం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమా వస్తున్న కారణంగా కచ్చితంగా మినిమంగా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ‘మీటర్’ సినిమా టీజర్ విడుదలతో చిన్న సినిమా అనే అభిప్రాయం తొలగిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కిరణ్ అబ్బవరం ఆశలు ‘మీటర్’ పైనే..
కిరణ్ అబ్బవరం కెరియర్ ఆరంభం నుంచి కూడా విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం కమర్షియల్ గా భారీ విజయాలను మాత్రం సొంతం చేసుకోలేక పోయాడు. గత నెలలో విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని నమోదు చేయలేక పోయింది. అందుకే మీటర్ పై కిరణ్ అబ్బవరం ఆశలు కాస్త ఎక్కువగానే పెట్టుకుని ఉంటాడు. ఆ మధ్య తనను ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కిరణ్ అబ్బవరం వార్తల్లో నిలిచారు. అయితే సోషల్ మీడియాలో పలువురు కిరణ్ అబ్బవరంను ఇబ్బంది పెట్టే అవసరం.. అవకాశం ఎవరికి ఉందంటూ కొట్టి పారేశారు. సినిమాల పబ్లిసిటీని తానే స్వయంగా చూసుకునే కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.
టీజర్ విడుదల తర్వాత 'మీటర్' పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు తమ పరిచయాలతో భారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ‘మీటర్’ తో కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.