బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా ఆమె.. మన రాం గోపాల్ వర్మతో పోటీ పడుతుందా అన్నట్లుగా ఉంటాయి ఆమె పోస్టులు. తనకు అవసరం ఉన్నా లేకున్నా కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉండే కంగనా రనౌత్ తీరును చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఆమె తనపై వచ్చే విమర్శలను అసలు పట్టించుకోదు. తన అభిప్రాయంను చెప్పేందుకు కంగనా ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే, కంగనా రనౌత్ ను ఫైర్ బ్రాండ్ అంటారు. తాజాగా మరోసారి కంగనా రనౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమైంది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియా మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్ధిఖీపై అత్యాచారం కేసు పెట్టడంతో పాటు గృహ హింస కేసు నమోదు చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబ సభ్యులపై కూడా ఆలియా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆలియా పదే పదే ఆరోపణలు చేసినా కూడా నవాజుద్దీన్ సిద్ధిఖీ మాత్రం మౌనంగా ఉంటూ వచ్చాడు. నవాజుద్దీన్ యొక్క మౌనంను చాలా మంది తప్పుబడుతూ ఉన్నారు. మౌనంగా ఉంటే ఆలియా యొక్క అన్ని ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుంది అంటూ ఆయన్ను పలువురు హెచ్చరించారు. అయినా కూడా ఇన్నాళ్లు మౌనంగానే ఉన్న నవాజుద్దీన్ ఎట్టకేలకు స్పందించాడు. తనపై ఆలియా చేస్తున్న ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చారు.
మౌనం ఎప్పుడు శాంతిని ఇవ్వదు
నవాజుద్దీన్ ప్రకటనపై హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది.. ఆలియాకు వ్యతిరేకంగా నవాజుద్దీన్ షేర్ చేసిన పోస్ట్‌ను షేర్ చేసిన కంగనా రనౌత్.. మౌనం ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. ఈ సమయంలో మీరు ఇలా చేయడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. మీరు ఇలాంటి ప్రకటన చేసినందుకు గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ నవాజుద్దీన్ కు మద్దతుగా కామెంట్ పెట్టింది. ఇప్పటికే విడాకులు తీసుకున్న నవాజుద్దీన్, ఆలియా మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో ఆలియా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంను కొందరు తప్పుబడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె తీరును సమర్ధిస్తున్నారు.
నవాజుద్దీన్ ప్రకటన
‘‘నేను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నందుకు అంతా నన్ను చెడ్డవాడినని అంటున్నారు. అందుకే నేను నా మౌనాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను. ఈ తమాషా మొత్తంను నా చిన్న పిల్లలు ఎక్కడి నుంచో చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో కొందరు నాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు. కొన్ని విషయాలను నేను ప్రత్యేకంగా అందరికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఆలియా నేను కలిసి ఉండే పరిస్థితి లేక విడాకులు తీసుకున్నాం. ఈ విషయం గురించి మా పిల్లలకు అవగాహన ఉంది. ప్రస్తుతం మా పిల్లలు దుబాయిలో స్కూల్ లో కాకుండా ఇండియాలో ఎందుకు ఉన్నారో ఆమె చెప్పాలి. 45 రోజులుగా వారు పాఠాశాలను మిస్ అవుతున్నారు. దుబాయ్ స్కూల్ నుంచి ప్రతి రోజు నాకు లేఖలు వస్తున్నాయి. పిల్లలు స్కూల్‌కు ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నిస్తున్నారు. 45 రోజులుగా ఇండియాలో నా పిల్లలు బంధీలుగా ఉన్నారు. ఇప్పటికే నేను ఆమెకు నెలకు సుమారు రూ.10 లక్షలు చెల్లిస్తున్నా. అయినా కూడా ఆమె ఇంకా డబ్బులు కావాలని అంటోంది. డబ్బుల కోసమే నన్ను, నా తల్లిని వేధిస్తోంది’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?