మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'అగ్ని నక్షత్రం' సినిమా గురించి చాలా రోజులుగా హడావిడి చేస్తున్నారు. ఆ మధ్య మంచు లక్ష్మి బర్త్‌ డే సందర్భంగా చిన్న వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ‘‘తెలుసా తెలుసా’’ అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మంచు లక్ష్మి అధికారికంగా ప్రకటించింది. ఈ పాటను టాలీవుడ్‌ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నట్లుగా తెలిపింది.

  




మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నాడు. అచ్చు రాజమణి సంగీతం అందించిన ‘‘తెలుసా తెలుసా’’ పాటతో సినిమా స్థాయి మరింతగా పెరుగుతుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మంచు లక్ష్మి ‘అగ్ని నక్షత్రం’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ పాట ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి. 


ఈ పాట విడుదలపై మంచు లక్ష్మి మంగళవారం ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఇక... ఎదురు చూపులకు ముగింపు.. సమంత ట్విట్టర్ పేజీలో మార్చి 8, సాయంత్రం 6 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా ‘‘తెలుసా తెలుసా’’ పాటను పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. మీరు రెడీ గా ఉండండి.. మేం మిమ్మల్ని మంత్రముగ్దులను చేయబోతున్నాం’’ అని ట్వీట్ చేసింది. 


మంచు మోహన్ బాబు సమర్పణలో


ఇప్పటికే పలు సినిమాలతో నటిగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మి ఈ సారి విభిన్న పాత్రతో ‘అగ్ని నక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు వంశీ కృష్ణ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ‘అగ్ని నక్షత్రం’ సినిమా కు మంచు మోహన్‌ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచు వారి ఫ్యామిలీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. ముఖ్యంగా మోహన్ బాబు.. మంచు విష్ణు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అయితే మంచు లక్ష్మి ఈ సినిమాతో ఆ సెంటిమెంట్‌ ను బ్రేక్ చేసి మంచు ఫ్యాన్స్ కు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి. ‘అగ్ని నక్షత్రం’ సినిమా షూటింగ్‌ అప్డేట్ ఏంటీ.. విడుదల ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో అధికారికంగా వెల్లడి చేసే అవకాశాలు ఉన్నాయి. మంచు లక్ష్మి ని అభిమానించే వారు మాత్రమే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అంటూ దర్శకుడు వంశీ కృష్ణ ఒక సందర్భంగా పేర్కొన్నారు. 


Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?