Ilayaraja Daughter Died: సంగీత స్వరకర్త ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె భవథరణీ (47) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె జనవరి 25న తుదిశ్వాస విడిచారు. ఐదు నెలల క్రితం భవథరణి క్యాన్సర్‌కు హెర్బల్‌ చికిత్స కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో నేడు సాయంత్రం 5:20 గంటలకు మృతి చెందినట్టు సమాచారం. ఆమె మృతితో కోలివుడ్‌ సినీ పరిశ్రమలో విషాదంలోకి వెళ్లింది. ఆమె ఆకస్మిక మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు షాక్‌ అవుతున్నారు. భవథరణి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సినీ ప్రముఖుల, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 






కాగా భవథరణి కూడా గాయని అనే విషయం తెలిసిందే. తండ్రి ఇళయరాజా సంగీతం అందించిన 'రాసయ్య' చిత్రంతోనే ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగులోనూ ఆమె పలు పాటలు పాడారు. లక్ష్మి మంచు, ఆది పినిశెట్టి, తాప్సీ చిత్రం 'గుండెల్లో గోదారి'లో ఓ పాట పాడారు. 'నన్ను నీతో నిను నాతో కలిపింది గోదారి' అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే తమిళంలో ఫ్రెండ్స్‌, పా టైమ్‌ ఓరు నాళ్‌ ఒరు కనవు, అనెగన్‌ వంటి తదితర చిత్రాల్లోనూ ఆమె పాటలు పాడారు. గాయనీగానే కాదు సంగీత దర్శకురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఫిర్‌ మిలేంగే, ఇలక్కనమ్‌, వెల్లాచి అవునా వంటి పలు చిత్రాలకు ఆమె సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. మరోవైపు ఆమె సోదరులు కూడా సంగీత దర్శకులు, సింగర్స్‌గా రాణిస్తున్నారు. ఇళయరాజ తనయులు కార్తీక్ రాజా, యువన్‌ శంకర్‌ రాజా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సంగీత దర్శకులుగా, గాయకులు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 






Also Read: నేను లేకుండా ఈవెంట్‌ ఎలా చేద్దామనుకున్నావు! - డైరెక్టర్‌పై నాగార్జున కామెంట్స్‌