టాలీవుడ్‌లో దాసరి నారాయణ తర్వాత ఎవరు పెద్దరికం తీసుకుంటారో క్లారిటీ వచ్చేసినట్లయింది. దాసరి పాత్రను పోషించాలన్న నరేష్ వ్యాఖ్యలను మోహన్ బాబు సున్నితంగా తిరస్కరించినా ఇక నుండి ఆయనదే పెదరాయుడి పాత్ర ఆయనదేనని అంటున్నారు. అయితే ఆయన ఆధిపత్యాన్ని.. పెద్దరికాన్ని అంగీకరించేందుకు ఇతర వర్గాలు సిద్దంగా లేవు. అందుకే ముందు ముందు టాలీవుడ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.


మోహన్ బాబే ఇక ఇండస్ట్రీ పెద్ద !


‘మా’ అధ్యక్ష పదవికి ప్రధానంగా పోటీ పడింది మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ అయినప్పటికీ చివరికి వచ్చే సరికి అసలు పోటీదారులు చిరంజీవి, మోహన్ బాబు అనే అనుకున్నారు. రెండు క్యాంప్‌లకు పిల్లర్లు ఈ ఇద్దరూ ఉన్నారని అనుకున్నారు. ఎవరి ప్యానల్ గెలిస్తే వాళ్లదే ఇండస్ట్రీలో పెద్దరికం వస్తుందని.. చనిపోక ముందు దాసరి నారాయాణరావు ఎలా అయితే అందరి సమస్యలు పరిష్కరించే పెదరాయుడి పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. దానికి తగ్గట్లుగానే పోరాటం హోరాహీరోగా సాగింది. చివరికి మంచు విష్ణు గెలిచారు. అంటే.. మోహన్ బాబు గెలిచినట్లే. ఇప్పుడు ఆయనే ఇండస్ట్రీ పెద్దమనిషి అనుకోవాలి.


Also Read : 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు


సమస్యలు పరిష్కరించే పలుకుబడి పెంచుకునే ప్రయత్నంలో మోహన్ బాబు ! 


మోహన్ బాబు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నలుగురితో పెదరాయుడు అని పిలిపించుకోవడం కాకుండా నలుగురితో అనిపించుకోవాలని ఆయన డిసైడయ్యారు. అందుకే "మా" మాజీ అధ్యక్షుడు నరేష్ దాసరి పాత్ర పోషించాలని అడిగినా సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తాను ముందు ఉంటానని చెప్పారు. ఇలా పరిష్కారం చేయగలగాలంటే ప్రభుత్వలతో సమన్వయం చేసుకోవాలి. అందుకే ఇండస్ట్రీ తరపున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. నిజంగా అలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇండస్ట్రీ తరపున సన్మానం చేస్తే.. వారు ఆ సన్మాన కార్యక్రమానికి వస్తే ఆటో మేటిక్‌గా వారిద్దరి ఆశీస్సులు మోహన్ బాబుకు ఉన్నట్లే అనుకోవాలి. అప్పుడు మీే ఇండస్ట్రీ పెద్ద అని ప్రత్యేకంగా ఎవరూ మోహన్ బాబుకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.


Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?


అందర్నీ కలుపుకుని వెళ్లగలిగితేనే పెదరాయుడి పాత్రలో సక్సెస్ !


అయితే మోహన్ బాబుకు ఇదేమంత తేలికైన విషయం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే "మా"లో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది.  అందరూ కలిసి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ‘మా’ ప్రచారం సమయంలో ఏర్పడిన విబేధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొంత మంది రాజీనామాలు చేస్తున్నారు. మరికొంత మంది ‘మా’ రాజకీయాలపై విరక్తి చూపిస్తున్నారు. అంటే మోహన్ బాబు చేపట్టే కార్యక్రమాలకు వారు హాజరు కావడం డౌటే. ఒక వేళ ముఖ్యమంత్రులిద్దరూ వచ్చి.. ఇండస్ట్రీ అంతా రాకపోతే వారు చిన్న బుచ్చుకుంటారు. అలా వస్తామని హామీ ఇస్తేనే వారు వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఈ విషయంలోనే కాదు. ‘మా’ నిధులు సమకూరేది ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ వల్లే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ నటులు .. కలసి కట్టుగా ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనరు.  ప్రోగ్రామ్స్ పెట్టినా స్టార్ హీరోలు హాజరు కారు.


Also read:  నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..


విఫలం అయితే టాలీవుడ్‌లో చీలిక ఖాయం !


ఇప్పుడు మోహన్ బాబు ముందున్న అసలు సమస్య అందర్నీ కలుపుకుని వెళ్లడమే. ఆ విషయంలో ఆయన ఎంత సక్సెస్ అవుతారో అనే దాన్నిబట్టే  ‘మా’ భవిష్యత్ కూడా నిర్ణయం అవుతుంది. లేకపోతే.. త్వరలోనే ‘మా’కు పోటీగా మరోకటి పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగిదే టాలీవుడ్లో నిట్ట నిలువునా చీలిక వచ్చినట్లవుతుంది. 


Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి