రెండు రోజుల క్రితం వరకూ ఎన్నికల హడావుడి...ఇప్పుడు రాజీనామాల హడావుడి.  గతంలో ఎన్నడూ లేనన్ని చిత్రాలు ఈ సారి 'మా' ఎన్నికల్లో చోటుచేసుకోవడమే కాదు ఎన్నికలయ్యాక కూడా కొనసాగుతున్నాయి. తాజాగా  మరోసారి ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజ్.  ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం  ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’మీరు గర్వపడతారు అంటూ ట్వీట్‌ చేశారు.





టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రకాశ్ రాజ్  ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఐ లవ్ యూ అంకుల్, మీ రాజీనామాను అంగీకరించేది లేదని చెప్పినా ప్రకాశ్ రాజ్ మెట్టుదిగడం లేదు. తన రాజీనామా వెనుక లోతైన అర్థం ఉందన్నారు. ఇన్నాళ్లూ తనకి అండగా ఉన్నవారి నమ్మకాన్ని వమ్ముచేయబోనని ట్వీట్టర్లో పేర్కొన్నారు. తనను తెలుగు వాడని కాదంటూ  మంచు విష్ణు ప్యానెల్ కు అండగా నిలిచిన వాళ్లంతా కామెంట్ చేయడం ప్రకాశ్ రాజ్ ను బాధించింది. అదే విషయాన్ని.. మా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు మీడియా సమావేశంలో ప్రకాశ్ చెప్పుకొచ్చారు.  ‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌" ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం అన్నారు. ఇలాంటి అజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని  తీర్పు ఇచ్చారు..‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.  ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావుగారు, రవిబాబు మాట్లాడారు. అందుకే అతిథిగానే ఉంటా అన్న ప్రకాశ్ రాజ్  తెలుగు ఇండస్ట్రీతో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అనే అబద్ధాన్ని నమ్మనన్న ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ తో తన సీరియస్ నెస్ కంటిన్యూ చేశారు. 
Also Read: 'కండబలం, డబ్బు బలానికి లొంగిపోయారు' నాగబాబు ఓపెన్ లెటర్..
 ఇప్పటికే  'మా' ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేశారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వం తో 'మా' కొట్టుమిట్టాడుతోంది. కండ బలం, డబ్బు బలానికి 'మా' సభ్యులు లొంగిపోయి.. కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నారు. ఈ కారణాల వలనే నేను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ కపట, దుర్భరమైన మనుషులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటూ ఓ లెటర్ విడుదల చేశారు. శివాజీ రాజా కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. తనకు తెలిసిన శ్రీకాంత్ అయితే 'మా' సభ్యత్వానికి రాజీనామాచేస్తాడని బండ్లగణేష్ అన్నారు. చూస్తుంటే 'మా' లో హీట్ ఎన్నికల ముందు కన్నా ఇప్పుడు మరింత పెరిగేట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Also Read: 'రాత్రికి రాత్రి ఏంజరుగుంటుందబ్బా..' రిజల్ట్ పై అనసూయ పోస్ట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి