ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి.. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోడానికి బాగా కష్టపడుతున్నాడు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పుడు యువ హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శ్రీ సింహా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా టాలీవుడ్ లోని మరో పెద్ద కుటుంబంలోని అమ్మాయిని వివాహమాడబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.


సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ ఎంపీ అయిన మాగంటి మురళీ మోహన్‌ మనుమరాలితో కీరవాణి తనయుడు ఏడడుగులు వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మురళీ మోహన్‌ కు ఒక కుమార్తెతో పాటుగా రామ్‌ మోహన్‌ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఆయన కూతురు రాగ మాగంటిని ఇప్పుడు శ్రీ సింహాకి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఇరు వర్గాలు మాట్లాడుకున్నారని, వచ్చే ఏడాది పెళ్లి జరిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 


కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ తండ్రి బాటలో సంగీత దర్శకుడిగా, సింగర్ గా రాణిస్తుండగా.. శ్రీ సింహ మాత్రం నటన వైపు అడుగులు వేశాడు. ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల్లో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన సింహ.. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘భాగ్ సాలే’ వంటి సినిమాల్లో నటించాడు. ఇటీవల ‘ఉస్తాద్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


మరోవైపు రామ్మోహన్, రూప దంపతుల కుమార్తె రాగ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమె మాగంటి ఫ్యామిలీకి ఏకైన వారసురాలు. ఇటీవలే ఆమె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలో మురళీ మోహన్ వ్యాపార వ్యవహారాలు చూసుకోనుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మురళీమోహన్, కీరవాణి కుటుంబాలు బంధుత్వం కలుపుకోబోతున్నారనే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్‌ గా మారింది.


ఇండస్ట్రీలో ఎంఎం కీరవాణి, మురళీ మోహన్ కుటుంబాలకు మంచి పేరుంది. ఇండియన్ సినిమాకు అందని ద్రాక్షలా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ ను సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లారు కీరవాణి. అలానే ఎన్నో ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్న మురళీ మోహన్ ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నారు. నటుడిగానే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా పేరు గడించారు. 


ఇప్పటికైతే కోడూరి - మాగంటి కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నారనే వార్త ప్రచారంలో మాత్రమే ఉంది. శ్రీ సింహా - రాగ వివాహం గురించి ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద ఫ్యామిలీలకు సంబంధించిన విషయం కావడంతో, సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. శ్రీ సింహా, రాగ మాగంటి పెళ్లి గురించి ఆరాలు తీస్తున్నారు.


Also Read: సంకెళ్లతో నాని.. ఆసక్తి రేకెత్తిస్తోన్న 'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial