నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే మునుపెన్నడూ లేనంత ఫుల్ ఫార్మ్ లో కొనసాగుతున్నారు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, మరోవైపు వెండితెరపై విజృంభిస్తున్నారు. ఇప్పటికే 'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన బాలయ్య.. లేటెస్టుగా 'భగవంత్ కేసరి' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా డొమెస్టిక్ మార్కెట్ లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం USA బాక్స్ ఆఫీస్ వద్ద 1 మిలియన్‌ డాలర్ క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. దసరా ఫెస్టివల్ స్పెషల్ గా గత గురువారం (అక్టోబర్ 19) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బరిలో 'టైగర్ నాగేశ్వరరావు' 'లియో' సినిమాలు ఉన్నప్పటికీ, మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. యూఎస్ లో ఇప్పటికే $ 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి, $ 1.5M దిశగా దూసుకుపోతోంది. 


Also Read: సంకెళ్లతో నాని.. ఆసక్తి రేకెత్తిస్తోన్న 'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్!


'భగవంత్ కేసరి' సినిమాని ఓవర్ సీస్ లో సరిగమ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. యూఎస్ లో కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు నిర్మాతలు తెలిపారు. కరోనా పాండమిక్ టైంలో 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. యునైటెడ్ స్టేట్స్‌లో $1 మిలియన్ కు పైగా వసూళ్లు రాబట్టారు. ఈ ఏడాది సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' చిత్రంతో మరోసారి మిలియన్ డాలర్ క్లబ్ లో చేశారు. ఇప్పుడు తాజాగా 'భగవంత్ కేసరి' కూడా మిలియన్ డాలర్ మార్క్ ను అధిగమించడంతో, హ్యాట్రిక్ మిలియన్ డాలర్ సినిమాలున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలిచారు.


'భగవంత్ కేసరి' చిత్రంలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. శ్రీలీల కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మించారు. ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ దావత్ పేరుతో ఈరోజు(అక్టోబర్ 23) సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 


'భగవంత్ కేసరి' కథేంటంటే...
ఓ కేసులో జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న‌ నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ)కి.. అక్కడి జైల‌ర్ (శ‌ర‌త్‌ కుమార్‌)తో మంచి అనుబంధం ఏర్పడుతుంది. కూతురు విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల‌)ను ఆర్మీలో చేర్చాల‌నేది జైలర్ కల. అయితే అనుకోకుండా జైల‌ర్ మ‌ర‌ణించ‌డంతో విజ్జిపాప బాధ్య‌త‌లను తీసుకున్న భ‌గ‌వంత్ కేస‌రి.. ఆమెని ఒక సింహంలా త‌యారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. విజ్జి పాప ఆర్మీలోకి వెళ్లిందా లేదా? సైకాల‌జిస్ట్ కాత్యాయ‌ని (కాజ‌ల్)తో కేసరికి సంబంధమేంటి? అసలు భ‌గ‌వంత్ కేస‌రి జైలుకి ఎందుకు వెళ్లాడు? బిలియ‌నీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్‌)తో ఉన్న గొడవేంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


Also Read: 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసేశా, మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే: బాలకృష్ణ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial