Mass Maharaja Raviteja Sustained a Muscle Tear in His Right Hand During the Filming of #RT75 : మాస్ మహారాజ్ రవితేజకి ప్రమాదం జరిగింది. RT75 సినిమా చిత్రీకరణలో కుడి చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ని యశోద ఆసుపత్రిలో చేర్పించగా.. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కీలక సూచనలు చేశారు. ఆరు వారాలపాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. షూటింగ్ సమయంలో దెబ్బ తగిలిందని, అయినప్పటికీ ఆయన షూటింగ్ లో పాల్గొన్నారని, దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చినట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
75 వ సినిమా..
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో ఇది 75వ సినిమా. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు శ్రీకర స్టూడియో సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. యువ రచయిత భాను భోగవరపు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వనున్నారు. 'సామజవరగమన'తో పాటు పలు హిట్ సినిమాలకు ఆయన రచయితగా వ్యవహరించారు. 'వాల్తేరు వీరయ్య'కు మాటలు రాశారు. బాలకృష్ణ - బాబీ కొల్లి సినిమాకు కూడా సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పుడు రవితేజ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. కాగా.. సినిమా శరవేగంగా సాగుతుండగా.. ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది.
విలన్‌గా నవీన్ చంద్ర..
రవితేజ తన సినిమాల్లో కొత్త వాళ్లకి, టాలెంట్ ఉన్నవాళ్లకి ఛాన్సులు ఇస్తూ ఉంటారు. అలా తన 75వ సినిమాలో ఒక యువ హీరోని విలన్ గా పెట్టుకున్నాడు. ఆయన నవీన్ చంద్ర. నవీన్ చంద్ర ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. గతంలో కూడా నవీన్ చాలా సినిమాల్లో నెగటివ్ షేడ్స్ చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ'లో చేశారు. ఇక ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు నవీన్ చంద్ర. ఇక ఈ సినిమా దర్శకుడు కూడా కొత్త వ్యక్తే. రచయితగా పని చేసినప్పటికీ కెరీర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే.
ఇటీవల రిలీజైన 'మిస్టర్ బచ్చన్'..
ఇక రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. 'రెయిడ్ అనే హిందీ సినిమా ఆధారంగా దాన్ని తెరకెక్కించారు హరీశ్ శంకర్. ఆ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, 'చమ్మక్' చంద్ర, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్ తదితరులు ఉన్నారు. సినిమా ఎట్లా ఉన్నా.. సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను తెగ అలరించాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Read Also: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!