Market Mahalakshmi movie teaser launched by Sree Vishnu: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడు ఒక మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన సినిమా 'మార్కెట్ మహాలక్ష్మి'. ఇందులో 'కేరింత' మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా నటించారు. టైటిల్ పాత్రలో ప్రణీకాన్వికా నటించారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. యువ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదల అయ్యింది.
ప్రపోజ్ చేస్తే చెంపదెబ్బ కొట్టిన హీరోయిన్!
'మార్కెట్ మహాలక్ష్మి' టీజర్ చూస్తే... తనకు ఇండిపెండెంట్ అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పే సాఫ్ట్‌వేర్ యువకుడిగా పార్వతీశాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మార్కెట్ మహాలక్ష్మిగా, కూరగాయలు అమ్మే అమ్మాయిగా ప్రణీకాన్వికా పాత్రను చూపించారు.
హీరోది అమలాపురం. అతడికి ఉద్యోగం రావడంతో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. మార్కెట్టులో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడతాడు. అయితే, ఆ అమ్మాయితో అతని తల్లికి గొడవ అవుతుంది. నచ్చిందని చెబితే అమ్మాయి లాగి పెట్టి ఒక్క చెంపదెబ్బ ఇచ్చింది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినందుకు అమ్మ కూడా కొట్టింది. పాపం... ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చివరికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది మనకు తెలియాలంటే సినిమా చూడాలి.
టీజర్ చూశా... చాలా బావుంది! - శ్రీ విష్ణు
వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో 'మార్కెట్ మహాలక్ష్మి' తెరకెక్కింది. బి2పి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేశారు. హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
టీజర్ విడుదల చేసిన తర్వాత హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... ''మూవీ టీజర్ చూశా. చాలా ఫన్నీగా ఉంటూనే... హీరో హీరోయిన్ల క్యారెక్టరైజెషన్లను పరిచయం చేశారు. నాకు అది నచ్చింది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నా. దర్శకుడు వియస్ ముఖేష్ చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ... ''మా టీజర్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి నా థాంక్స్. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా'' అని అన్నారు.
Also Read: ఆహాలో ఆంటోనీ - తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా
కమెడియన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ హీరో శ్రీ విష్ణు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే... 'మార్కెట్ మహాలక్ష్మి' లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కధలు శ్రీ విష్ణు గారు చాలా చేశారు. చేస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఎంతో ఇష్టమైన హీరో. అందువల్ల, మరింత హ్యాపీగా ఉంది'' అని చెప్పారు. 'మార్కెట్ మహాలక్షి' సినిమాకు కళా దర్శకుడు: సంజన కంచల, నృత్య దర్శకత్వం: రాకీ, నేపథ్య సంగీతం: సృజన్ శశాంక, సాహిత్యం: వీఎస్ ముఖేష్ - జోయ్ ఎమ్నావ్, కూర్పు: ఆర్ఎం విశ్వనాథ్ కుంచానపల్లి, ఛాయాగ్రహణం: సురేంద్ర చిలుముల, స్వరాలు: జోయ్ ఎమ్నావ్, నిర్మాత: అఖిలేష్ కిలారు, రచన - దర్శకత్వం: వీఎస్ ముఖేష్.