Queen 2 Update By Director Vikas Bahl: 'క్వీన్'.. కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఈ బాలీవుడ్ సినిమా  సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్ప‌టికీ ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు ప్రేక్ష‌కుల్లో. అందుకే, ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని వెయిట్ చేస్తున్నారు చాలామంది సినిమా ల‌వ‌ర్స్. అయితే, ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించి అప్ డేట్ ఇచ్చేశారు డైరెక్ట‌ర్ వికాస్ బాహ్ల్. త్వ‌ర‌లోనే 'క్వీన్ - 2' సినిమా షూటింగ్ షురూ అవుతుంద‌ని చెప్పారు వికాస్. 


'క్వీన్' రిలీజై ప‌దేళ్లు.. అయినా త‌గ్గ‌ని క్రేజ్.. 


బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ న‌టించిన 'క్వీన్' సినిమాని వికాస్ బ‌హ్ల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజై ప‌దేళ్లు అవుతోంది. పెళ్లాయ్యాక హ‌నీమూన్ వెళ్లాలి అనుకునే ఒక అమ్మాయి టికెట్స్ బుక్ చేస్తుంది. కానీ, పెళ్లి కొడుకు వివాహాన్ని ర‌ద్దు చేసుకుంటాడు. దీంతో తాను ఒక్క‌తే హ‌నీమూన్ వెళ్తుంది. అక్క‌డ ఎలాంటి ఇబ్బందులు ప‌డింది? ఎలాంటి వాళ్ల‌ను క‌లుసుకుంది? ఏం నేర్చుకుంది? అనేది 'క్వీన్' సినిమా. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సూప‌ర్ హిట్ గా నిలిచింది. దీన్నే తెలుగు, తమిళ్‌లో కూడా రీమేక్ చేశారు. అయితే, ఈసినిమా వ‌చ్చి పదేళ్లు అయినా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్పారు డైరెక్ట‌ర్ వికాస్. ఇప్ప‌టికీ జ‌నాలు సీక్వెల్ గురించి ప్ర‌శ్నిస్తూనే ఉంటారు అని ఆయ‌న అన్నారు. 


“సినిమా నిన్న, మొన్న రిలీజైన‌ట్లు అనిపిస్తుంది. సీక్వెల్ గురించి ఎవ‌రో ఒక‌రు అడుగుతూనే ఉంటారు న‌న్ను. సీక్వెల్ క‌థ రెడీ అయిపోయింది. డ‌బ్బు కోసం తీయాలంటే నాలుగేళ్ల కింద‌టే 'క్వీన్ - 2' రిలీజ్ అయ్యేది. 'క్వీన్' సినిమా రేంజ్ లోనే సీక్వెల్ ఉండాల‌నే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు టైం తీసుకున్నాం. ఇక ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతుంది” అని చెప్పారు వికాస్ బాహ్ల్. అయితే, ఈ మూవీలో కంగనా నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌లో కూడా కంగానాకే ఛాన్స్ ఇస్తారా? లేదా వేరే హీరోయిన్‌కు అవకాశమిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


‘సైతాన్’ ప్ర‌మోష‌న్స్ లో బిజీ 


ఇక ప్ర‌స్తుతం వికాస్ ‘సైతాన్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ గురువారం రిలీజ్ కాగా.. అది ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘సైతాన్’ మూవీ చేతబడి నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. బాలీవుడ్‌లో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావ‌డం ఇదే మొద‌టిసారిగా తెలుస్తోంది. ‘సైతాన్’ ఒక పాపులర్ గుజరాతీ హారర్ మూవీ ‘వష్’కు రీమేక్‌. ‘వష్’.. గుజరాతీలో మంచి హిట్‌ను అందుకుంది. ఇప్పుడు అదే కథతో బాలీవుడ్‌లో హిట్ అందుకోవాలని చిత్ర బృందం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ సినిమాని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 8న థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడానికి ‘సైతాన్’ వచ్చేస్తున్నాడు. కాగా.. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, పోస్ట‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నాయి.


Also Read: బేబీ బంప్‌తో భూమా మౌనిక - మంచు మనోజ్ లవ్లీ రిప్లై