Manjummel Boys Telugu Trailer Is Out Now: ఫిబ్రవరీలో విడుదలయిన మలయాళ సినిమాలు అన్నీ తెలుగులో కూడా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అవ్వకపోయినా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను మలయాళ భాషలోనే చూసి వాటిని హిట్ చేశారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఇప్పటివరకు ఈ మూవీ అసలు తెలుగులో విడుదలే అవ్వలేదు. అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూవీ లవర్స్.. దీనిని సబ్ టైటిల్స్‌తో చూసి హిట్ చేశారు. ఫైనల్‌గా ఏప్రిల్ 6న ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ వర్షన్‌ను విడుదల చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. దీంతో దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.



అక్కడ ఏం జరిగింది..?


‘మంజుమ్మెల్ బాయ్స్’ అనేది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్. ముందుగా ఈ సినిమా ట్రైలర్‌.. ‘‘అసలు ఆ ప్రాంతానికి నిజమైన పేరు ఏంటో తెలుసా? డెవిల్స్ కిచెన్. ఎందుకంటే అక్కడే దెయ్యాలు వారి ఆహారాన్ని సంపాదించుకుంటాయి’’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత మంజుమ్మెల్ బాయ్స్ ఇంట్రడక్షన్. ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనేది ఒక టీమ్ పేరు. వారంతా కలిసి తమిళనాడులోని కొడైకెనాల్‌కు ట్రిప్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కొడైకెనాల్‌లోని ఫేమస్ టూరిస్ట్ ప్రాంతాలను చూస్తూ గుణ కేవ్స్ దగ్గర ఆగుతారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘గుణ’ చిత్రం ఈ గుహల్లోనే తెరకెక్కించడంతో వీటికి గుణ కేవ్స్ అని పేరు వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత ‘మంజుమ్మెల్ బాయ్స్’కు ఏం జరిగింది అనేదే సినిమా కథ.


గుణ కేవ్‌లో కథ..


‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్‌లోని ఒక వ్యక్తి గుణ కేవ్స్‌లో ఇరుక్కుపోయినట్టు, అతడిని కాపాడడానికి మిగిలిన వారంతా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ట్రైలర్‌లో చూపించారు. కానీ వారికి సాయం చేయడానికి పోలీసులు సైతం వెనక్కి తగ్గినట్టుగా కూడా చూపించారు. సినిమాలో గుణ కేవ్ అనే పేరు ఎవరు విన్నా భయపడడం, ‘‘సెంట్రల్ మినిస్టర్‌తోనే కాలేని పని మీతో ఏం అవుతుంది’’ అనే డైలాగ్.. ‘మంజుమ్మెల్ బాయ్స్’పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు తెలుగు ప్రేక్షకులు.. ఈ సినిమాను ఒరిజినల్ మలయాళ వర్షన్‌లో చూసినా కూడా తెలుగులో మరోసారి చూడడానికి సిద్ధమవుతున్నారు.


రికార్డ్ స్థాయి కలెక్షన్స్..


చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ బడ్జెట్ కేవలం రూ.4 కోట్లు మాత్రమే. కానీ ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను సాధించి.. అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రంగా రికార్డులను క్రియేట్ చేసింది. శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్.. ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’లో నటించిన నటుల సంఖ్య ఎక్కువే అయినా ఇందులో ప్రతీ పాత్రకు ప్రాధాన్యతను ఇచ్చాడు దర్శకుడు. ఇక ‘గుణ’ మూవీలోని ‘కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే’ పాట.. ‘మంజుమ్మెల్ బాయ్స్’లో కీలకంగా మారనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఇదే పాటతో ముగిసింది.


Also Read: కొత్త దర్శకులతో పనిచేయనని తేల్చిచెప్పిన విజయ్ దేవరకొండ - ఎందుకంటే?