Vijay Devarakonda About Working With Debut Directors: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. పరశురామ్‌తో విజయ్ రెండోసారి కలిసి చేస్తున్న చిత్రమే ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో విజయ్ బిజీ అయిపోయాడు. తెలుగుతో పాటు తమిళ మార్కెట్‌పై కూడా ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే తమిళ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ క్రమంలో తను అసలు కొత్త దర్శకులతో పనిచేయనని తేల్చిచెప్పాడు విజయ్. దాని వెనుక కారణమేంటో కూడా బయటపెట్టాడు.


పెద్ద ఛాలెంజ్..


ఈరోజుల్లో స్టార్ హీరోలు సైతం కొత్త టాలెంట్‌ను నమ్మి ఒక్క సినిమా కూడా అనుభవం లేని దర్శకులకు ఛాన్సులు ఇస్తున్నారు. ఇక అలాంటి దర్శకులు కూడా తమలో ఎంత సత్తా ఉందో మొదటి సినిమాతోనే నిరూపిస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఎప్పటికీ డెబ్యూ దర్శకులతో పనిచేయనని ప్రకటించాడు. ఆ నిర్ణయం వెనుక తన అభిప్రాయం ఏంటో బయటపెట్టాడు. ‘‘నేను ఇప్పుడు కొత్త దర్శకులతో పనిచేయడానికి సిద్ధంగా లేను. కనీసం వాళ్లకు ఒక్క సినిమా అనుభవం అయినా ఉండాలి. ఎందుకంటే సెట్‌లోకి ఏ అనుభవం లేకుండా అడుగుపెట్టడం అనేది పెద్ద ఛాలెంజ్. చాలా ప్రెజర్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, బడ్జెట్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.


అది ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే..


‘‘దర్శకులకు అప్పటికే ఒక సినిమా అనుభవం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ప్రతీ సినిమాతో బెటర్ అవుతూనే ఉంటారు. ఎవ్వరి మొదటి సినిమా అయినా వారికి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ప్రాక్టీస్ మ్యాచ్ చేసినట్టు ఉంటుంది. వార్మ్ అప్ చేసినట్టు ఉంటుంది. అలా దర్శకులు నాకోసం సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను సెట్స్‌లోకి చాలా ప్రిపేర్ అయ్యి అడుగుపెడతాను. అలాంటప్పుడు దర్శకులు రెడీగా నాతో ఏది నచ్చితే అది చేయించేలాగా ఉండాలి. అందుకే నేను డెబ్యూ డైరెక్టర్స్‌తో పనిచేయను. ఒకవేళ వారికి ఒక సినిమా అనుభవం ఉన్నా కూడా వారి మ్యూజిక్, ఎడిట్ సెన్స్‌ను చూస్తాను. విజువల్‌గా కథను ఎలా చెప్తున్నారో గమనిస్తాను. వాళ్ల సినిమా హిట్ అవ్వాలని లేదు. దర్శకులకు ఒక సినిమా అనుభవం ఉండి, ఆ సినిమా నాకు నచ్చితే వాళ్లతో కచ్చితంగా కలిసి పనిచేస్తాను’’ అని తెలిపాడు విజయ్.


ప్రేక్షకుల విమర్శలు..


విజయ్ దేవరకొండ కొత్త దర్శకులతో పనిచేయను అంటూ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దానిపై పలువురు నెటిజన్లు విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే విజయ్‌ను హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ కచ్చితంగా ఉంటాయి. ఆ రెండు సినిమాలను కూడా తను కొత్త దర్శకులతోనే చేశాడు. వారిని నమ్మి వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం వల్లే విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ అయ్యాడు. అలాంటిది ఫేమ్ వచ్చిన తర్వాత కొత్త దర్శకులతో పనిచేయను అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు.


Also Read: తంత్రం మంత్రం కుతంత్రం - ఆహాలో మరో హారర్ చిత్రం