Manisha Koirala About Madhuri Dixit: సీనియర్ బాలీవుడ్ హీరోయిన్స్‌లో మాధురీ దీక్షిత్, మనీషా కొయిరాలకు ఉన్న క్రేజే వేరు. వీరిద్దరూ 80, 90ల్లో యూత్‌కు తమ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, గ్రేస్‌తో ఉర్రూతలూగించారు. కానీ అప్పట్లో మాధురీపై మనీషాకు వేరే అభిప్రాయం ఉండేదట. అందుకే తనతో కలిసి నటించే అవకాశం వచ్చినా వద్దనుకున్నానని, ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నానని మనీషా కొయిరాల బయటపెట్టారు. చాలాకాలం తర్వాత ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు మనీషా. ఇక దీని ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.


అందుకే తప్పుకున్నాను..


ఒక సీనియర్ దర్శకుడితో, ఒక పెద్ద నిర్మాణ సంస్థలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆ సినిమాలో మాధురీ దీక్షిత్ కూడా ఉందనే కారణంతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట మనీషా కొయిరాల. ‘‘యశ్ చోప్రా సినిమాతో చేయలేదు అన్నది నేను నా కెరీర్ విషయంలో బాధపడే అతిపెద్ద విషయం. నేను మాధురీని పోటీ అనుకున్నాను. భయపడ్డాను. అందుకే ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను’’ అని బయటపెట్టారు. కానీ మాధురీ దీక్షిత్, మనీషా కొయిరాల కలిసి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లజ్జా’ అనే మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత మాధురీపై తన అభిప్రాయం ఎలా మారిపోయిందో వివరించారు మనీషా. 


ఆమె నిరూపించారు..


‘‘మాధురీ చాలా మంచి మనిషి, మంచి నటి. నేను అసలు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదని ఆమె నిరూపించారు. మన ముందు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఉంటే మనకు కూడా బాగా నటించాలి అనిపిస్తుంది. వయసు, ఎక్స్‌పీరియన్స్ వస్తే ఈ విషయం అర్థమవుతుంది. లజ్జా మూవీలో మాధురీతో కలిసి నటించడం నాకు చాలా నచ్చింది. రేఖాతో కూడా కలిసి నటించడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు మనీషా కొయిరాల. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన ‘దిల్ తో పాగల్ హై’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినా.. అప్పట్లో ఈ మూవీని మనీషా కొయిరాలతో పాటు పలువురు నటీమణులు రిజెక్ట్ చేశారు. ఫైనల్‌గా నిషా పాత్రను పోషించే అవకాశం కరిష్మా కపూర్ చేతికి వెళ్లింది.


‘హీరామండి’తో కమ్ బ్యాక్..


ప్రస్తుతం మనీషా కొయిరాల, మాధురీ దీక్షిత్ ఇంకా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అప్పటితో పాటు ఇప్పటి ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక పలు కారణాల వల్ల చాలాకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు మనీషా. మళ్లీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌తో నేరుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్.. లాహోర్‌లోని ఒక రెడ్ లైట్ ఏరియాలో జరిగిన కథ. 1940.. అంటే ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు ‘హీరామండి’ అనే రెడ్ లైట్ ఏరియాలో జరిగిన సంఘటనలను సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కించారు. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చడ్డా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ కూడా లీడ్ రోల్స్‌లో నటించారు.



Also Read: హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా?