Child Artist Nikhil Devadula: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులలో నిఖిల్ దేవాదుల కూడా ఒకడు. ఎంతోమంది స్టార్ హీరోలకు చైల్డ్ యాక్టర్‌గా నటించి యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరో అయ్యేంత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోలతో కలిసి నటించిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. అంతే కాకుండా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ మహేశ్ బాబు సినిమా నుండి తనను తొలగించారని బయటపెట్టాడు.


నా ప్లేస్‌లో గౌతమ్..


తనకు అవకాశం వచ్చి, ఆ తర్వాత చేజారిపోయిన సినిమాల గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు నిఖిల్. ‘‘1 నేనొక్కడినే.. సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాను. షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వచ్చారు. అలా ఒక వారంపాటు ఆడిషన్సే జరిగాయి. నాకు డేట్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్స్ ఫైనల్ చేశారు. ఫోన్ చేసి అప్డేట్ చేస్తామన్నారు. డైరెక్ట్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చూస్తే గౌతమ్ ఉన్నాడు. ‘ఆగడు’లో కూడా నేను చేయాల్సింది. నిఖిల్ అనే వేరే అబ్బాయి చేశాడు. అప్పటికీ నాకు డేట్స్ కూడా ఇచ్చేశారు. కానీ అదే రోజు రాత్రి ఫోన్ చేసి పోస్ట్‌పోన్ అయ్యిందని చెప్పారు. తరువాత రోజు ఆ నిఖిల్ అనుకొని నాకు ఫోన్ చేసి లొకేషన్‌కు రాలేదేంటి అని అడిగారు. పోస్ట్‌పోన్ అయ్యిందని చెప్పారు కదా అనగానే ఫోన్ పెట్టేశారు’’ అంటూ రెండుసార్లు మహేశ్ బాబు సినిమాల్లోనే ఛాన్స్ మిస్ అయ్యిందని గుర్తుచేసుకున్నాడు నిఖిల్.


అలా అవకాశం పోయింది..


తనకు డేట్స్ అడ్జస్ట్ అవ్వక వదిలేసిన సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు నిఖిల్. ‘‘బాహుబలి చేసిన తర్వాత అవసరాల శ్రీనివాస్ నటించిన ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా చేశాను. అందులో నా రోల్ 25 నిమిషాలు ఉంటుంది. దానికోసం గుండు చేయించుకోమన్నారు. నేను బాగా ఆలోచించి చేయించుకున్నాను. అప్పుడు తమిళ ఇండస్ట్రీ నుండి నాకు కాల్స్ వచ్చాయి. ఒక సినిమాలో లీడ్ రోల్ చేయాలి. వయసుకు తగిన క్యారెక్టర్ అని చెప్పి అచ్చం బాహుబలిలో ఉన్నట్టు పెద్ద జుట్టు కావాలి అంటే నేను గుండు చేయించుకున్నాను అని చెప్పాను. దాంతో వాళ్లు వద్దనుకున్నారు’’ అంటూ కోలీవుడ్ నుండి తనకు వచ్చిన అవకాశం ఎలా చేజారిపోయిందో గుర్తుచేసుకున్నాడు నిఖిల్.


కొడితే రక్తం వచ్చింది..


ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కు హీరోతో కలిసి పనిచేసే సీన్స్ చాలా తక్కువే ఉంటాయి. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు చిన్నప్పటి రోల్‌లో నటించినప్పుడు మూడు కెమెరాలు ఉండేవని, ఒకవైపు తన షూటింగ్, ఒకవైపు ప్రభాస్ షూటింగ్ జరిగేదని చెప్పుకొచ్చాడు నిఖిల్. ముఖ్యమైన సీన్స్ చేస్తున్నప్పుడు రాజమౌళి ఉండేవారని లేకపోతే ఆయన స్థానంలో కో డైరెక్టర్లు షూట్ చేసేవారని తెలిపాడు. ఇక రాజశేఖర్ హీరోగా నటించిన ఒక సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నప్పుడు టీచర్ పాత్ర చేసిన ఒక మహిళ తనను నిజంగానే కొట్టారని, రక్తం కూడా వచ్చిందని గుర్తుచేసుకున్నాడు నిఖిల్. ఇక సినిమాలో స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలాసార్లు దెబ్బలు తగిలాయని బయటపెట్టాడు. తను హీరోగా నటించనున్న చిత్రం కోసం 19 కేజీలు తగ్గానని చెప్పుకొచ్చాడు.



Also Read: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా