నాయట్టు... 2021లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా. 'నాయట్టు' అంటే వేట అని అర్థం. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' సినిమాలో విలన్ రోల్ చేసిన జోజు జార్జ్ గుర్తు ఉన్నారా? 'నాయట్టు' సినిమాలో ఆయన ఓ మెయిన్ లీడ్. ఇంకా కుంచకో బోబన్, నిమిషా సజయన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాయట్టు' కేరళలో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది ఆహా. 


తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్'గా...
Nayattu In Telugu: 'నాయట్టు' చిత్రాన్ని తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్'గా డబ్బింగ్ చేశారు. ఏప్రిల్ 26న... అంటే ఈ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలియజేసింది ఆహా ఓటీటీ.






మలయాళంలో విమర్శకుల ప్రశంసలతో పాటు విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్న పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది ఆహా ఓటీటీ. ఆ కోవలో ఇప్పుడు 'నాయట్టు' సినిమాను తీసుకు వస్తోంది. ఒక పోలీస్ వెంట మరొక పోలీస్ పడితే... లాకప్ డెత్ తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కానిస్టేబుల్ ను పట్టుకోవడానికి మరొక పోలీస్ ప్రయత్నిస్తే ఏం జరిగింది? అనేది చిత్ర కథ. 


Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!



ఏప్రిల్ 8, 2021లో కేరళలో 'నాయట్టు' విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్ కావడం, ఓటీటీలో విడుదలకు రెడీ కావడం విశేషం. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించడంతో పాటు రంజిత్, పీఎం శశధరన్ తో కలిసి నిర్మించిన 'చుండూరు పోలీస్ స్టేషన్'కు విష్ణు విజయ్ సంగీతం అందించారు.


Also Readబీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?



తెలుగులో రీమేక్ అయిన 'నాయట్టు'... 
శ్రీకాంత్ నటించిన సినిమా చూశారా?
మలయాళ సినిమాలు ఫాలో అయ్యే ప్రేక్షకులకు 'నాయట్టు' గురించి తెలుసు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినట్టు ఎంత మందికి తెలుసు? శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా ఉంది కదా! అది 'నాయట్టు'కు రీమేక్. 


మలయాళంలో జోజు జార్జ్ నటించిన పాత్రను తెలుగులో శ్రీకాంత్ పోషించారు. ఆ సినిమాలో నిమిషా విజయన్ చేసిన క్యారెక్టర్ తెలుగులో శివానీ రాజశేఖర్ చేశారు. ఇంకా రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. తెలుగులో సినిమా చూసిన వాళ్లు మాతృక ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటే... 26వ తేదీ నుంచి ఆహా లాగిన్ అయితే చాలు. 'చుండూరు పోలీస్ స్టేషన్' చూడొచ్చు.


Also Readప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?