Rentala Jayadeva's Mana Cinema First Reel Book Review: కెమేరాలో ఫిల్మ్ మీద క్లిక్ మనిపించిన చిత్రాన్ని ఫొటో రూపంలోకి తీసుకురావడం ఒక ప్రక్రియ. డార్క్‌రూమ్‌లో ఫిల్మ్‌ని డెవలపర్, సిట్రిక్ యాసిడ్, యాసెటిక్ యాసిడ్‌, అల్యూమినియం థియోసల్ఫేట్ లాంటి ద్రావకాల సహాయంతో డెవలప్ చెయ్యాలి. అప్పుడు నెగెటివ్ తయారవుతుంది. ఈ నెగెటివ్‌ని ఫొటో పేపర్ మీద పాజిటివ్ (ఫొటో)గా మార్చడం మరో వ్యవహారం. అలాగే ఫిల్మ్ (సినిమా) పట్ల సమాజంలో ఉన్న నెగెటివిటీని పాటిజివ్‌గా మార్చాలంటే... పరిశీలన, విశ్లేషణ, విమర్శ, పరిశోధన అనే ప్రక్రియలు నిరంతరం జరుగుతూనే ఉండాలి.


మొదటి మూడూ చేసేవారు చాలామందే ఉంటారు. ఇంకా చెప్పాలంటే, సోషల్ మీడియా వచ్చిన తరువాత పెరిగారు కూడా! కానీ పరిశోధన చాలా పరిమితం. నటులు, సాంకేతిక నిపుణుల జీవిత కథలు, నిర్మాణ సంస్థల ప్రస్థానాలు… పరిశోధనగా చలామణీ అయిపోతున్నాయి. కానీ సినీ చరిత్ర గురించి అసలు సిసలు పరిశోధన చాలా అరుదు. నిజానికి, ఇతర అంశాలపైన జరిగే పరిశోధనల కన్నా… కళా రంగాల గురించి జరిగే పరిశోధనల మీద ప్రజలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అవి వారి జీవితాలతో విడదీయలేని భాగం కాబట్టి! వర్షంలో తడవనివాడు, ప్రేమలో పడనివాడు ఉండడన్నారు ఎవరో పెద్దాయన. అలాంటివారైనా ఉండొచ్చు కానీ... సినిమా చూడనివాళ్ళు మాత్రం కచ్చితంగా ఉండరు. 


మన దేశంలో సినిమా ప్రధాన మాధ్యమంగా మారి కనీసం ఏడు దశాబ్దాల పైనే అయిందని అనుకుంటే... ఆ సమయంలో జీవించినవారిలో, ఆ తరువాత పుట్టినవారిలో ప్రేక్షకుడు కాని మనిషి దాదాపు ఎవరూ లేరని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలు భారతదేశ సినీ ప్రేక్షక రాజధానులు. 2023 ఏప్రిల్‌లో 'ఇండియా ఇన్ పిక్సిల్స్' విడుదల చేసిన ఒక అధ్యయన వివరాల ప్రకారం... 1,097 సినిమా థియేటర్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, 485 థియేటర్లతో అయిదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. దేశంలో 6,877 థియేటర్లుంటే... సింహభాగం... దాదాపు నాలుగో వంతు ఈ రెండు రాష్ట్రాలదే! ఇంతటి ఈ ఘనత ఉన్న మనం... మన సినిమా చరిత్ర విషయంలో ఎంత అజ్ఞానంలో ఉన్నామో...  కొన్నేళ్ళ కిందట పాత్రికేయుడు రెంటాల జయదేవ తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' అసలైన విడుదల తేదీని (1932 ఫిబ్రవరి 6) వెలికి తీసి, నిరూపించారు. ఆ తరువాత అంతకన్నా బృహత్కార్యాన్ని నెత్తికెత్తుకున్నారు. అదే ఈ 'మన సినిమా… ఫస్ట్ రీల్'!


పుస్తక రచనను కేవలం తెలుగు సినిమాకే జయదేవ పరిమితం చేయలేదు. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా తన పరిశోధనను ఆయన విస్తరించారు. మూకీ చిత్రాలు, తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా' (1931మార్చ్14)లతో మొదలుపెట్టారు. తొలి కన్నడ చిత్రం 'సతీ సులోచన', మొదటి మలయాళం టాకీ 'బాలన్' విశేషాలను వివరిస్తూనే... దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల ఆదానప్రదానాల గురించి, ఇతర భాషా చిత్రాల ప్రభావాల గురించి, సోదాహరణంగా వివరించారు. (సోదాహరణంగా అనే పదానికి సరైన అర్థం ఈ పుస్తకం చూస్తే తెలుస్తుంది. కరపత్రాలు, పత్రికా ప్రకటనలు, వాల్ పోస్టర్లు, ఆనాటి ప్రముఖులు స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు... ఇలా దొరికినవన్నిటినీ ఈ పుస్తకంలో జయదేవ పొందుపరిచారు. కళ్ళుండీ చూడలేని నిత్యశంకితులు, కువిమర్శకులకు అవి కనువిప్పు). ఈ వివరాలు, దాదాపు 2 వేల దాకా బొమ్మలు కలసి మొత్తం 566 పేజీలున్న ఈ పుస్తకాన్ని మరింత ఆసక్తిదాయకంగా మార్చాయి. 


కానీ మధ్యలో... జయదేవ వివరించిన ఒక విషయం... ఆయన అత్యుత్తమ చరిత్రకారుడని స్పష్టం చేస్తుంది. ఆ సంగతులు ఈ పుస్తకంలోని ఆయన మాటల్లో చెప్పాలంటే ... “భక్త ప్రహ్లాద కన్నా ముందే తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడాయని మీకు తెలుసా? అవును... నిజం. 'తొలి తెలుగు టాకీ'గా ప్రాచుర్యంలో ఉన్న 'భక్త ప్రహ్లాద' కన్నా ముుందే, తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడాయి.” చాలామందికి తెలియని సంగతి ఇది. తెలిసిన కొద్దిమంది కూడా దాన్ని అలవాటులో పొరపాటుగా విస్మరిస్తూ ఉంటారు. అలా తెరపై తొలిసారిగా తెలుగుమాటలు వినిపించి, పాటలు పలికించి... ఇప్పటికి తొంభై వసంతాలు దాటేశాయి. మన దక్షిణాది చిత్రపరిశ్రమ మూగతనం వదిలి, మాట, పాట నేర్చిన ఆ తొలి సినిమా 'కాళిదాస్'. అప్పటి వాణిజ్య ప్రకటనలను బట్టి చెప్పాలంటే, 'తొలి తమిళ - తెలుగు' టాకీ 'కాళిదాస్.' 


గమ్మత్తేమిటంటే, దీన్ని ప్రాథమికంగా తెలుగు సినిమాగా తీయాలని మొదలుపెట్టారు. తీరా నిడివి తక్కువున్న 4 రీళ్ళ చిత్రమే అయింది. దాంతో, తమిళ పాటలు, డ్యాన్సులు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి నృత్యాల లఘు చిత్రాలను కూడా ఈ చిత్ర ప్రదర్శనలో కలిపారు. అలా ఆ 'కాళిదాస్' ప్రదర్శన ముచ్చటగా మూడు వేర్వేరు లఘు చిత్రాల ‘ప్రోగ్రామ్’ అన్నమాట. (ఈ ‘ప్రోగ్రామ్’ అన్న మాట కూడా ఆ సినిమా రిలీజు వేళలోనే సినిమా దర్శక, నిర్మాతలు ‘కాళిదాస్’ సినిమాపాటల పుస్తకంలో స్పష్టంగా ఉపయోగించిన సంగతి జయదేవ సాక్ష్యాధారాలతో చూపారు). వెరసి, తొలి దక్షిణ భారతీయ భాషా టాకీగా 'కాళిదాస్' మూడు చిన్న నిడివి చిత్రాల సమాహారంగా, ఒక కదంబ ప్రదర్శనగా జనం ముందుకు వచ్చింది. తెలుగులో మాటలు, త్యాగరాయ కీర్తనలు, తమిళంలో జాతీయవాద గీతాలు, ప్రణయ గీతాలు, కురత్తి డ్యాన్సులతో… రెండు భాషల వారినీ అలరించింది. 


వెరసి, పూర్తిగా తెలుగు మాటలే ఉన్న '100% సంపూర్ణ తెలుగు టాకీ'... 'భక్త ప్రహ్లాద' రిలీజు (1932 ఫిబ్రవరి 6) కన్నా మూణ్ణెల్ల పైచిలుకు ముందే 1931 అక్టోబర్ 31న విడుదలై, తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడిన, తెలుగు త్యాగరాయ కీర్తనలతో అలరించిన టాకీ సినిమా... ఈ 'కాళిదాస్'. తమిళులు ఆ చిత్రాన్ని తమ తొలి టాకీగా చెప్పుకుంటూ తమ చరిత్రలో కలిపేసుకుంటూ ఉంటే… అచ్చంగా తెలుగు మాటలే ఉన్న ఆ చిత్రాన్ని తెలుగువాళ్ళమైన మనం లెక్కలలో పూర్తిగా వదిలేసుకున్నాం. మన చరిత్రకు మనమే ఇన్నాళ్ళుగా చేస్తున్న మహా అపచారం ఇది. ఇకనైనా మన అలసత్వాన్ని సరిదిద్దుకోవాలన్నది సత్యనిష్ఠ, నిజాయతీతో రెంటాల జయదేవ చేస్తున్న అభ్యర్థన. 


అలాగే, తమిళంలో తొలి పూర్తి టాకీ ‘కాళిదాస్’ కాదనీ, మన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ తర్వాత రెండు నెలలకు ఎప్పుడో వచ్చిన ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) అనీ ఆయన ప్రామాణికంగా చూపారు. ఈ సంగతులన్నీ సాక్ష్యాధారాలతో వివరిస్తూ, సినీ చరిత్రకారుడిగా జయదేవ ఈ ఫస్ట్ రీల్ పుస్తకంలో వెలికి తీసిన అనేక అంశాలు, చేసిన ప్రతిపాదనలు... ఆయనను తెలుగు సినీ చరిత్రకారుల్లో అత్యున్నత స్థానంలో నిలబెడతాయనడంలో సందేహం లేదు. 


ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పుస్తకాన్ని రాసిన తీరు. 'తారీకులు... దస్తావేజుల' పరిశోధనా గ్రంథంలా కాకుండా చక్కగా చదివించడానికి రచయిత తీసుకున్న జాగ్రత్త ప్రతి పేరాలో కనిపిస్తుంది. మనకు తెలియని ఒక (సినీ) చారిత్రక విషయం కనిపిస్తుంది, వెనువెంటనే మనకు తెలిసిన ఓ సినిమా విశేషం మురిపిస్తుంది. పాత్రికేయునిగా జయదేవ అనుభవం... దీన్ని సినిమా కథల పుస్తకంగా రూపుదిద్దింది.


ఈ పుస్తకం ముందు, వెనుక మాటల్లో, పుస్తకావిష్కరణ సభల్లో జయదేవను 'సినిమా పిచ్చోడు'గా చాలామంది అభివర్ణించారు. అది నిజమే... కానీ పరమ చాదస్తుడు కూడా!  చాలామంది ఏడాదికో, ఆర్నెల్లకో ఓ పుస్తకాన్ని 'ఈని' పడేస్తున్న ఈ రోజుల్లో... కచ్చితత్వంతో, నికార్సయిన పుస్తకాన్ని తీసుకురావాలన్న తపనతో పాతికేళ్ళ పాటు ఈ పుస్తకాన్ని మనోగర్భంలో మోసిన వ్యక్తిని... 'పిచ్చోడు', 'చాదస్తుడు'... ఇలా ఏదైనా అనొచ్చు. కానీ ప్రేక్షకుడిగా, విశ్లేషకుడిగా, సమీక్షకుడిగా తనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిన సినిమాకి... దాని 'బుడిబుడి నడకల'ను అద్దం పట్టి చూపించే బాధ్యత ఆయన తీసుకున్నారు. కాబట్టి ఇది బాధ్యతైన మంచి ప్రయత్నం. 


Also Read: రెంటాల జయదేవ గురించి 'మన సినిమా... ఫస్ట్ రీల్' పుస్తకావిష్కరణలో మాటల మాంత్రికుడు, గురూజీ, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ఏం చెప్పారంటే?


మనమందరం సినీ ప్రేక్షకులమే కాబట్టి... మనం చదివి, మన తరువాతి తరాలకు 'చరిత్ర'గా అందించాల్సిన నోస్టాలజీ... ఈ 'ఫస్ట్ రీల్'. ఎమెస్కో వారు అత్యున్నత ప్రమాణాలతో, చాలా అందంగా ముద్రించిన ఈ పుస్తకం ఆంధ్రదేశంలోని ఎమెస్కో బుక్ స్టాల్స్, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్ లైన్ లో అమెజాన్, లోగిలి, తెలుగు బుక్స్ సహా పలు వెబ్ సైట్లలో లభిస్తోంది. దాదాపు 2 వేల దాకా ఫోటోలు, అరుదైన సమాచారం, చరిత్రను సరిదిద్దే అనేక కొత్త పరిశోధనాత్మక వాస్తవాలున్న ఈ పుస్తకం ధర ఫోటోకు పావలా చొప్పున వేసుకున్నా… పాఠకులకు భలే మంచి చౌకబేరమే!


డాక్టర్ రెంటాల జయదేవ రచనలో వచ్చిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’లో 566 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకం ధర 750 రూపాయలు మాత్రమే. విజయవాడలోని ఎమెస్కో బుక్స్ స్టోర్‌తో పాటు ఇతర అన్ని ప్రముఖ బుక్ షాపుల్లోనూ 'మన సినిమా... ఫస్ట్ రీల్' దొరుకుతుంది. అమెజాన్, లోగిలి, తెలుగు బుక్స్ వంటి ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉంది. 


Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?