''నేను పోటీగా ఉండే ఏరియాలోకి రాను.. పోటీ లేని ఇంకో ఏరియాలోకి వెళ్లిపోతాన''ని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, ఉత్తమ సినీ విమర్శకునిగా నంది పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ రెంటాల జయదేవ (Rentala Jayadeva) రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లోని బోయి విజయ భారతి వేదికపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. రెంటాల జయదేవ పాతికేళ్ల సినీ పరిశోధనకు అక్షర రూపమైన ఈ పుస్తక తొలి ప్రతిని ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని సభాధ్యక్షత వహించిన ‘ఎమెస్కో’ విజయ్ కుమార్‌కు ఆయన అందజేశారు. వీరితో పాటు తెలంగాణ భాష - సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జయదేవకు జర్నలిజంలో పాఠాలు చెప్పిన గురువు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి - విమర్శకులు అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్, సీనియర్ జర్నలిస్ట్ ఇందిరా పరిమి తదితరులు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పుస్తక గ్రంథాన్ని అందుకున్నారు.
పుస్తకావిష్కరణ తర్వాత రచయిత రెంటాల జయదేవతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజులవి. నా ప్రయత్నాల్లో నేను ఉన్నప్పుడు మద్రాసులో రెంటాల జయదేవ నాకు పరిచయం అయ్యారు. అప్పటికే జర్నలిస్ట్‌గా ఉన్న ఆయన రాసే ప్రత్యేక సినిమా వ్యాసాలు, సమీక్షలు, ముఖచిత్ర కథనాలు, కాలమ్స్ చూసేవాడిని. ‘ఇతను ఎవరో బాగా రాస్తున్నారు’ అని ఆయనపై ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఓ సందర్భంలో కలిసిన తర్వాత మా మధ్య స్నేహబంధం మొదలైంది. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెంటాల రాసిన ఈ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ బుక్‌లో ఇప్పటి వరకు 200 పేజీలు చదివా. కృష్ణ కౌండిన్య, మామిడాల హరికృష్ణ ఈ బుక్ మొత్తం చదివారని తెలిసి మొదట భయపడ్డా. నేనిప్పుడు ఆ పుస్తకంలో వివరాల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే, నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను.. పోటీ లేని ఇంకో ఏరియాలోకి వెళ్లిపోతాను.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
ఈ బుక్‌కి ఆయన ఫస్ట్ రీల్ పేరు పెట్టడంలోనే ఎంతో సక్సెస్ అయ్యారు. మాములుగా సినిమాకు ఫస్ట్ రీల్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతాం. సినిమా తాలూకా తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కనుక ఈ పుస్తకానికి ‘ఫస్ట్ రీల్’ అని పేరు పెట్టారు. సినిమా మొదలైన పది నిమిషాలలో ఫస్ట్ రీల్ కథలోకి ఎలా తీసుకు వెళుతుందో.. అంత ఇంట్రెస్టింగ్‌గా ఈ బుక్‌ని ఆయన రాశారు. మాములుగా నేనసలు పరిశోధనాత్మక గ్రంథాలు చదవను. ఎందుకంటే నేను చరిత్రలో వీక్. రాజుల కాలం నాటి శాసనం అని మొదలు పెట్టగానే చరిత్ర ఎగ్జామ్ గుర్తుకు వచ్చి భయం వేస్తుంది. అందుకే లెక్కలు, సైన్స్ చదువుకున్నా. అలాంటిది మన సినిమా చరిత్రను కళ్ళముందుంచిన ‘ఫస్ట్ రీల్’లోని 200 పేజీలను రెండు కాఫీల టైమ్‌లో చదివేశానంటే.. అది జయదేవ గొప్పతనం. సినిమాలు అంటే జయదేవ అంత పిచ్చ ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఎంత ఆథెంటిక్‌గా ఉంటుందో ఆయన ప్రూవ్ చేశాడు. జయదేవ కూడా సినిమా రచయిత అయ్యేలోపు మరికొన్ని పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే రెంటాల జయదేవ ‘ఫస్ట్ రీల్’ అనే పుస్తకం రాయలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... ఇలా దక్షిణ భారతీయ భాషల తొలి టాకీల తాలూకా కథ చెప్పాడు. ఇదొక నవల లాంటి పుస్తకం. దీనిని చదవడం మొదలు పెడితే రెండు మూడు గంటల్లో మూడొందల పేజీలు చదివిస్తుంది. ఇది 500 పేజీల పుస్తకం అని అస్సలు అనిపించదు.
‘ఫస్ట్ రీల్’ పుస్తకంలో.. అప్పటి మూకీల కోసం వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లలో సినిమాలు చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కన అమ్ముతున్న తంపడ వేరుశనక్కాయలు తాలూకా వాసన, సోడాలు ఫ్రీ అంటే సోడా కొడుతున్న గోళీల సౌండ్ ఇలా అప్పటి రోజుల్లో సినిమా తాలుకూ విషయాలన్నింటిని కళ్ల ముందు పెట్టేశాడు జయదేవ. ఈ మధ్య సినిమా పోస్టర్‌కు పెద్దగా విలువ లేదు. కానీ వందేళ్ళ క్రితం నాటి ఆ పోస్టర్ల ఆధారంగా జయదేవ మేజర్ రీసెర్చ్ చేయడం విశేషం. ఇప్పుడు కొంత సమాచారం మనకి ఇంటర్‌నెట్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ జయదేవ ఎవరికీ తెలియని కొంత సమాచారాన్ని ఈ బుక్ ద్వారా తెలుపుతూ.. ఆనాటి రోజుల అనుభూతిని చేర్చారు. నోస్టాల్జియా మూమెంట్స్ క్యాప్చర్ చేసేలా ఓ పరిశోధనాత్మక గ్రంథం రాయడం చాలా కష్టం. ఆరుద్ర రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ పుస్తకానికి ఎక్కువ విలువ రావడానికి కారణం ఏమిటంటే... ఒక కవి పండితుడు అయితే ఉండే అడ్వాంటేజ్‌ను ఆయన వాడుకున్నాడు. అలాగే, ఒక రచయిత ఒక పీహెడ్‌డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో ఈ ‘ఫస్ట్ రీల్’లో అలా ఉందని నాకు అనిపించింది. జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు. అంతకు మించిన వాడు. కచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎందుకు ఇన్నేళ్ల పాటు సమగ్రమైన, సంపూర్ణమైన రచన చేయలేదనే ప్రశ్న నా మదిలో ఉంది. జయదేవ తండ్రి గారు, సోదరి అందరూ బుక్స్, నవలలు రాశారు. జయదేవ ఎందుకు రాయడం లేదు? అనే ప్రశ్న ఉండేది. కానీ, ఆయనని అడగలేదు. ఎందుకంటే.. నన్ను ఎదురు అడుగుతారని. రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమా రాస్తున్నావని అడుగుతారేమో అని! నా దృష్టిలో రచయితకు కొంత అజ్ఞానం అవసరం. అందుకని, కొంత అజ్ఞానంతో జయదేవ ఎక్కువ పుస్తకాలు రాయాలని, నా లైబ్రరీలో ఒక ర్యాకు ఆయన పుస్తకాలతో నిడిపోవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
ఇంకా ఈ కార్యక్రమంలో ‘ఎమెస్కో’ విజయ్ కుమార్, ఐఆర్ఎస్ ఆఫీసర్ కృష్ణ కౌండిన్య, ఎమెస్కో ప్రచురణల సంపాదకులు ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ భాష - సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వంటివారు ఈ బుక్ గురించి మాట్లాడుతూ.. రెంటాల జయదేవను అభినందించారు. ‘సినిమాలపై నేను పుస్తకం రాయకపోతే నాతో మాట్లాడానని మా అక్క నాతో చెప్పింది. మా అక్క చెప్పిన గడువు దాటినా, సంవత్సన్నర ఆలస్యంగా అక్కకు ఇచ్చిన మాట చెల్లించుకున్నానని, అమ్మ తర్వాత అమ్మలా నన్ను సాకినటువంటి మా మూడో అక్క కల్పన, మా మూడో అన్నయ్య రెంటాల రామచంద్ర ఈ పుస్తకం రావడంలో నా వెన్ను తట్టి ప్రోత్సహించారు’ అని తెలుపుతూ గురువు చంద్రశేఖర్ రెడ్డికి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, ఇంకా హాజరైన అతిథులకు రెంటాల జయదేవ ధన్యవాదాలు తెలిపారు.