ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల పాప చైత్రని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు రాజు అనే దుర్మార్గుడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా... హంతకుడి ఆచూకీ దొరకలేదు. దీంతో పదిలక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. కాగా ఈ సంఘటన సామాన్యులనే కాదు సెలెబ్రిటీలను కలచి వేస్తోంది. మంచు మనోజ్ ఇప్పటికే ఆ పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సంఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై జరిగిన ఘోరం చూస్తుంటే మన సమాజంలో విలువలు ఏ స్థాయిలో పడిపోయాయో తెలుస్తోంది. మన కూతుళ్లు సురక్షితంగా బతకగలరా? అనే ప్రశ్న నిత్యం తొలిచేస్తోంది. ఇది నిజంగా కడుపుతరుక్కుపోతున్న ఘటన. ఆ కుటుంబం ఎలా తట్టుకుంటుందో ఊహించలేం’అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ‘అధికారులను త్వరితగతిన చర్యలు చేపట్టి ఆ బిడ్డకు, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
నేచురల్ స్టార్ నాని కూడా ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు తమ ట్విట్టర్ లో హంతుకుడి ఫోటోతో పాటూ వివరాలను అందించి, అతడిని పట్టుకునేందుకు సహకరించమని కోరింది. పట్టించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఆ ట్వీట్ ను నాని రీట్వీట్ చేసి...‘బయటెక్కడో ఉన్నాడు... ఉండకూడదు’అని రాశారు. ఆ నిందితుడిని పట్టించమని నెటిజన్లను పరోక్షంగా కోరారు.
ఆ నిందితుడి రెండు చేతులపై ‘మౌనిక’ అని పచ్చబొట్టు ఉంటుందని, గెడ్డంతో, మెడ చుట్టూ స్కార్ఫ్ కట్టుకుని ఉంటాడని తెలంగాణ పోలీసులు తమ ట్వీటు పేర్కొన్నారు. అతడు ఆల్కహాల్ తాగి ఫేవ్ మెంట్ల మీద, బస్టాపుల్లోను పడుకుంటాడని తెలిపారు. అతడిని చూసిన వారు 9490616366 లేదా 9490616627 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాల్సిందిగా కోరారు.