Hero Surya About Mahesh Babu: తెలుగు సినీ అభిమానులకు మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, అద్భుత నటనతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా, నవ యవ్వనంతో అమ్మాయిల కలల రాకుమారుడిలా కొనసాగుతున్నారు. రోజు రోజుకు అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. తాజాగా ఆయన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. 


మహేష్ బాబు, సూర్య క్లాస్ మేట్స్


ఇక మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ అందేంటంటే? కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్. ముగ్గురు కలిసి చదువుకున్నట్లు స్వయంగా సదరు తమిళ స్టార్ హీరో చెప్పారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సూర్య. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. తెలుగు సినిమా నటులు అక్కడే ఉండేవారు. కోలీవుడ్, టాలీవుడ్ నటుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అలా రెండు పరిశ్రమలకు చెందిన నటీనటుల పిల్లలు కూడా కలిసి చదువుకునే వారు. అలా, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి ఒకే స్కూల్లో చదువుకునే వారట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య చెప్పారు. స్కూల్లో కార్తి, మహేష్, తాను మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమని చెప్పారు. క్లాసులో బెంచీలు ఎక్కి దూకడంతో పాటు బాగా అల్లరి చేసే వాళ్లమని చెప్పారు. మహేష్ ఎప్పుడు చెన్నైకి వచ్చినా, చిన్న నాటి స్నేహితులను కలిసి సరదాగా గడుపుతారని చెప్పుకొచ్చారు.



చెన్నైలోనే మహేష్ బాబు విద్యభ్యాసం  


నిజానికి మహేష్ బాబు చక్కగా తమిళం మాట్లాడుతారు. ఆయన హీరోగా నటించిన ‘స్పైడర్’ మూవీకి తమిళ డబ్బింగ్ ను కూడా ఆయనే చెప్పుకున్నారు. దానికి కారణం చిన్నప్పుడు ఆయన చెన్నైలో పెరగడమే. పదవ తరగతి వరకు చెన్నైలోని సెయింట్ బెడె స్కూల్ లో చదివారు. అక్కడే లయోలా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. 5  ఏండ్ల వయసులోనే మహేష్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు. బాల నడుటిగా 7 సినిమాలు చేశాడు. కానీ, చదువుకు ఇబ్బంది కలుగుతుందని భావించి సినిమాల వద్దని చెప్పారు. ఆ తర్వాత మహేష్ బాబు చదువు మీద ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత 1999లో ‘రాజ కుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టారు. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.  


Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు