Mahesh Babu Helps Fan: చాలామంది సినీ సెలబ్రిటీలు.. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని చారిటీకి ఇస్తూ ఉంటారు. కొందరు అయితే దగ్గరుండి మరీ కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదరిస్తారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఒకరు. ముఖ్యంగా చైల్డ్ హార్ట్ కేర్ విషయంలో మహేశ్ బాబు చేసే చారిటీ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలుసు. అంతే కాకుండా తన ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చిందని తెలిసినా సాయం చేయడానిక మహేశ్ ముందుంటారని అభిమానులు అంటుంటారు. ఈ విషయాన్ని ఈ సూపర్ స్టార్ మరోసారి నిరూపించారు. తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు.


టైటిల్స్‌నే పేర్లుగా..


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తికి మహేశ్ బాబు అంటే చాలా ఇష్టం, అభిమానం. ఆ అభిమానంతోనే తనకు పుట్టిన ముగ్గురు కొడుకులకు మహేశ్ నటించిన సినిమా టైటిల్స్‌నే పేర్లుగా పెట్టుకున్నాడు. వారి పేర్లు అర్జున్, అతిథి, ఆగడు. ఇటీవల రాజేశ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తను పనికి కూడా వెళ్లడం ఆపేశాడు. అలా ఇల్లు గడవడం కష్టమయిపోయింది. అందుకే కుటుంబం గడవడం కోసం తన పిల్లలు చదువు ఆపేశారు. తమకు తోచిన పని చేసుకుంటూ ఖర్చులను నెట్టుకొస్తున్నారు. పిల్లలు స్కూలు మానేసి తన తండ్రికి సాయం చేయడం కోసం పనిచేస్తున్న విషయాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపల్.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు తెలిసేలా చేశాడు.


బాధ్యత తనదే..


కొందరు మహేశ్ బాబు ఫ్యాన్స్ కలిసి ఈ రాజేశ్ కుటుంబ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా ఈ విషయం మెల్లగా మహేశ్ బాబు వరకు చేరింది. వెంటనే ఆయన స్పందించారు. తన చారిటీ ఫౌండేషన్ సాయంతో రాజేశ్ చికిత్సకు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తన ముగ్గురు కొడుకులను మళ్లీ స్కూల్‌లో జాయిన్ చేసి ఫీజు కూడా కట్టారు. ఇప్పుడు మాత్రమే కాదు.. వారి చదువు పూర్తయ్యేవరకు ఫీజులు మొత్తం మహేశ్ బాబు ఫౌండేషన్ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ బయటపెట్టారు. దీంతో రీల్ లైఫ్‌లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మహేశ్ బాబు హీరోనే అంటూ తన అభిమానులు ఈ విషయాన్ని తెగ షేర్ చేసేస్తున్నారు.


గ్రామాలను దత్తత..


ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నారని తెలియగానే మహేశ్ బాబు స్పందించడం ఇదేమీ మొదటిసారి కాదు. పరోక్షంగా మాత్రమే కాకుండా ప్రత్యేక్షంగా కూడా ఆయనే వెళ్లి ఫ్యాన్స్‌ను కలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 1000కు పైగా చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించారు. వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకొని వాటిని డెవలప్ కూడా చేశారు. అలా మహేశ్ బాబు చేసిన చారిటీ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చని అభిమానులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం మిగతా ప్రాజెక్ట్స్‌ను హోల్డ్‌లో పెట్టారు మహేశ్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.



Also Read: క్లిన్‌కారా ఫస్ట్ బర్త్ డే.. అందరూ అడిగేవారు, చాలా టెన్షన్ పడ్డానంటూ చెర్రీ కామెంట్స్ - ఎమోషనల్ వీడియో వదిలిన ఉపాసన