విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా ‘మార్క్ ఆంటోని’. ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో సెల్వరాఘవన్, రీతూ వర్మ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా హిందీలో అదే టైటిల్‌తో సెప్టెంబర్ 22న విడుదల కానుంది.  రీసెంట్ గా తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్ స్టర్  కథాశంతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.


విశాల్ మార్క్ ఆంటోనీపై మద్రాస్ హైకోర్టు స్టే?


తాజాగా ‘మార్క్ ఆంటోని’  సినిమాకు సంబంధించి తమిళ మీడియాలో వచ్చిన వార్తలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సినిమా విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధించిందని పలు చానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో సినీ అభిమానులు షాక్ కు గురయ్యారు.  హీరో విశాల్‌ కు లైకా ప్రొడక్షన్ సంస్థ  కొంత డబ్బును ఇవ్వాలని, దాంతో ఆయన స్టే కోసం కోర్టుకు వెళ్లాడని వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను చిత్ర నిర్మాత వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇవి నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేశారు. ఈ వార్తలను ప్రసారం చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించారు.   


సోలోగా ‘మార్క్ ఆంటోని’ విడుదల


నిజానికి ‘మార్క్ ఆంటోని’ సినిమాతో పాటు రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన ‘చంద్రముఖి2’ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉంది. అయితే, ‘చంద్రముఖి2’ సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘మార్క్ ఆంటోని’ సోలోగా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.


 ఆశలన్నీ విశాల్ ‘మార్క్ ఆంటోని’ మీదే!


గత కొంత కాలంగా కోలీవుడ్ హీరో విశాల్ ఓ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' సినిమా తర్వాత ఇప్పటివరకు విశాల్‌కు మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం విశాల్ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో 'మార్క్ ఆంటోనీ' కూడా ఒకటి. ఈ సినిమాలో విశాల్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.


Read Also: ‘చంద్రముఖి 2’ రిలీజ్ వాయిదా, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial