Hamunam - Venkaiha Naidu: పెద్ద పెద్ద హీరోల సినిమాలతో పాటుగా, సంక్రాంతి బరిలో నిలిచారు 'హనుమాన్‌' టీమ్‌. రిలీజై మూడు వారాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేస్తోంది ఈ సినిమా. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. అంతేకాదు.. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్‌ గ్రహీత వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకుంది చిత్ర బృందం. స్నేహితులతో కలిసి సినిమా చూసిన ఆయన ప్రశాంత్‌వర్మపై, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. 


వెంకయ్యనాయుడు ప్రశంసలు


"హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను.  దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత  నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మ కు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు." అని ఆయన ట్వీట్‌ చేశారు. 






రికార్డుల మోత


కుర్ర హీరో తేజ సజ్జ నటించిన ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ ప్రతిభను ఎంతోమంది మెచ్చుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బాలకృష్ణ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా ఎంతోమంది ప్రముఖులు ఈసినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రయూనిట్‌ని ప్రశంసించారు. స్వయంగా కలిసి వాళ్లను అభినందించారు. 


'హనుమాన్‌' సినిమా ఆద్యంతం ఒక అద్భుతం అనే చెప్పాలి. ప్రతి సీన్‌ ప్రేక్షకుడికి విజువల్‌ ఫీస్ట్‌. ఆంజనేయుడు కనిపించిన ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఉంది. అలాంటి పవర్‌ఫుల్‌సీన్లు చాలా చక్కగా చూపించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తక్కువ ఖర్చుతో అద్భతమైన గ్రాఫిక్స్‌ని రూపొందించి యంగ్‌ టాలెంట్‌ ఏంటో రుచి చూపించారు ప్రేక్షకులకి. అందుకే, ఇప్పటికీ థియేటర్లకు క్యూ కడుతున్నారు సినిమా లవర్స్‌. రిలీజై మూడు వారాలు దాటినప్పటికీ ఇప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు తిరగరాస్తూనే ఉంది 'హనుమాన్‌'. 


జనవరి 12న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో రిలీజ్‌ అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకోవడంతో థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అంచనాలకు మించి సినిమా ముందుకు దూసుకుపోతోంది. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా సినిమా వావ్‌! అనిపించేలా కలెక్షన్లు రాబడుతోంది. మూడోవారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోయింది 'హనుమాన్‌' బాహుబలి కలెక్షన్ల తర్వాత ఈ సినిమాకే అన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మూడో వారం తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్లలో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమాని కూడా బీట్‌ చేసింది. ఇక అంతేకాకుండా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న 'అల వైకుంఠపురం' సినిమా రికార్డులను కూడా బీట్‌ చేసింది 'హనుమాన్‌'.  


Also Read : ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'