మలయాళ ప్రజలను మాత్రమే కాదు... ఇతర రాష్ట్రాల్లో పేక్షకుల హృదయాలను సైతం కదిలించిన తాజా మలయాళీ సినిమా '2018'. కేరళను కుదిపేసిన వరదల నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సుమారు 20 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీసిన ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ చిత్రానికి జూడ్ జోసెఫ్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. అతనితో సినిమా చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ వెల్లడించింది.


లైకాలో జూడ్ ఆంటోనీ సినిమా!
అగ్ర హీరోలు, దర్శకులతో ఒక వైపు భారీ సినిమాలు... మరో వైపు లో బడ్జెట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు... అన్ని తరహాల సినిమాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 'కత్తి', 'ఖైదీ నంబర్ 150', 'నవాబ్', 'ర్.0', 'దర్బార్' సినిమాలతో పాటు తాజా 'పొన్నియన్ సెల్వన్'ను ఆ సంస్థే నిర్మించింది. 'కణం', 'డాన్', 'తీర కాదల్' వంటి సినిమాలూ నిర్మించింది. '2018' వంద కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో జూడ్ జోసెఫ్ ఆంటోనీతో ఎటువంటి సినిమా నిర్మిస్తారో చూడాలి.    


జూడ్ జోసెఫ్, లైకా సినిమాలో చిరు నటిస్తారా?
జూడ్ జోసెఫ్ ఆంటోనీ (Jude Joseph Antony ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి, ఆ సినిమా లైకా ప్రొడక్షన్స్ నిర్మించే సినిమా అవుతుందా? లేదంటే మరొకటా? అనేది చూడాలి.


Also Read : మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...
  
కొన్ని రోజుల క్రితం చిరంజీవిని కలిసి జూడ్ జోసెఫ్ ఆంటోనీ ఓ కథ చెప్పారని, దానికి 'మెగా'స్టార్ ఆమోద ముద్ర లభించిందని సమాచారం. నిజం చెప్పాలంటే... దర్శకుడిగా జూడ్ అనుభవం కేవలం నాలుగు సినిమాలు మాత్రమే! ఆ నాలుగు పదేళ్లలో తీశారు. మిగతా మూడు కంటే '2018' సినిమా ఆయన్ను ఇతర భాషల ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.


చిరంజీవి, జూడ్ ఆంటోనీ జోసెఫ్ కలయికలో సినిమాను ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుందని వినిపించింది. 'స్పై' సినిమాను నిర్మించినదీ ఆ సంస్థే. ఆ సినిమా రిజల్ట్ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ మారినా మారొచ్చు. 'ఖైదీ నంబర్ 150' ఒరిజినల్ వెర్షన్, విజయ్ హీరోగా నటించిన 'కత్తి'ని లైకా సంస్థ నిర్మించింది. లైకా సమర్పణలో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' విడుదల అయ్యింది. 


Also Read నెల క్రితమే నిహారిక, చైతన్యకు విడాకులు - ఆలస్యంగా వెలుగులోకి!



వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి?
ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఎవరితో సినిమా చేస్తారు? దానికి దర్శకుడు ఎవరు? అనేది అధికారికంగా ప్రకటించలేదు. మొన్నటి వరకు లిస్టులో పూరి జగన్నాథ్ పేరు వినిపించింది. అయితే... రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' స్టార్ట్ చేస్తున్నారు. 


చిరు, పూరి కాంబినేషన్ కాకుండా... చిరంజీవి, వీవీ వినాయక్ కాంబినేషన్ కూడా మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు సినిమా దర్శకుల్లోని మెగా అభిమానుల్లో వీవీ వినాయక్ (VV Vinayak) ఒకరు. చిరు హీరోగా 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' చేశారాయన. అయితే... ఆ రెండూ రీమేకులే. ఈసారి స్ట్రెయిట్ కథతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారని టాక్.