Adipurush HD Version Leak : ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డైలాగులు, ఇతర సన్నివేశాలను తీసివేయాలంటూ మేకర్స్‌పై ఒత్తిడి నెలకొంది. తాజాగా వారికి మరో తలనొప్పి వచ్చి పడింది. అసలే కలెక్షన్స్ లేక విలవిల్లాడుతున్న నిర్మాతలను పైరసీ భయపెడుతోంది. ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి ముందే.. HD (హై డెఫినిషన్) వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ అంశంపై మీమ్స్, ట్వీట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి.
జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన 'ఆదిపురుష్' పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్, డైలాగులు, పాత్రలపై ట్రోలింగ్ జరిగింది. భారీ అంచనాలతో విడుదల కావడం వల్ల ఓపెనింగ్స్ బాగున్నాయి. తొలి రోజే రూ.140 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. మూడు రోజుల పాటు బాక్సాఫీస్ ను ఏలింది. కానీ అంతలోనే మూవీకి నెగటివ్ టాక్ రావడంతో నాలుగో రోజు నుంచి మూవీ డౌన్‌ఫాల్ మొదలైంది. చివరికి బ్రేక్ ఈవెన్ సాధించడానికి కూడా ఈ మూవీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ.. ప్రీరిలీజ్ బిజినెస్ ప్రకారం రూ.282 కోట్లను బ్రేక్ ఈవెన్ ను సాధించాలి. కానీ 'ఆదిపురుష్' రిలీజైన 12 రోజుల తర్వాత కూడా దాన్నిఅందుకోలేకపోయింది.
వాస్తవంగా 'ఆదిపురుష్'ను ఆగస్ట్ వరకు ఓటీటీలోకి తీసుకురాకూడదని మేకర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడీ లీక్ తో ముందుగానే అంటే జూలై నెలలో సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. కాగా దీనిపై త్వరలోనే మేకర్స్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
'ఆదిపురుష్' లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. అయితే ఈ సినిమా రామాయణాన్ని దారుణంగా అవమానించిందని, అపహాస్యం చేసిందని మూవీపై విమర్శలు ఉన్నాయి. పాత్రలను చూపించే విధానంలోనూ మేకర్స్ ఎన్నో వివాదాలను ఎదుర్కోవల్సి వచ్చింది. చివరకు కోర్టులు కూడా ఈ చిత్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
టెలివిజన్ ధారావాహిక 'రామాయణం'లో హనుమంతుడిగా ప్రసిద్ధి చెందిన దివంగత నటుడు దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ 'ఆదిపురుష్' లోని పాత్రలపై స్పందించారు. థోర్, మార్వెల్ వంటి సినిమాలను చూసి యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా చేశారు కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. "రామాయణం తీయాలనే ఆలోచనలో ఉంటే కథకు కట్టుబడి ఉండాల్సింది. మందు తాగి వచ్చారో.. ఏం చేశారో తెలియదు. ఏం ఆలోచించి తీశారో. ఇంత భారీ బడ్జెట్‌తో ఇంత అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ వస్తే దాన్ని నాశనం చేశారు. మేకర్స్ ఈ కథలో డ్రాగన్‌లను పరిచయం చేశారు. తమాషా పనులు చేస్తూ కథతో ఆడుకున్నారు. ఇది తీవ్రంగా నిరాశపరిచింది" అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also : Jailer: తమన్నా మూడ్‌తో రానున్న ‘కావాలా’ - ఫన్నీగా రజినీకాంత్ ‘జైలర్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial