ABP Desam Exclusive: ప్రస్తుతం RAW ఏజెంట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తున్నాయి. మన టాలీవుడ్ హీరోలు సైతం గూఢచారులుగా, నిఘా ఏజెంట్ లుగా, సెక్యూరిటీ కమాండోలుగా అలరిస్తున్నారు. అసలు ఏజెంట్స్ అంటే ఎవరు? వారికి కావాల్సిన ఎలిజిబిలిటేస్ ఏంటి? స్పై నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలేంటే ఇప్పుడు చూద్దాం.
వెండితెరపై ఏజెంట్ల విన్యాసాలు - కృష్ణ.. ఫస్ట్ ఏజెంట్
స్పై ఏజెంట్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. 007 కోడ్ నేమ్ తో సిల్వర్ స్క్రీన్ మీద చేసే యాక్షన్ సీన్స్, సరికొత్త కార్లతో చేసే చేజింగ్స్, రకరకాల గన్స్ తో విలన్స్ పై ఫైరింగ్ చేయడం వంటివి గుర్తుకు వస్తాయి. అయితే మన తెలుగు ప్రేక్షకులకు గూఢచారి చిత్రాలను పరిచయం చేసింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. ఆయన బాటలో అనేకమంది టాలీవుడ్ స్టార్స్ ఏజెంట్స్ గా అలరించారు.
మొన్న నాగ్, నేడు అఖిల్
ఇప్పుడు లేటెస్టుగా యూత్ కింగ్ అఖిల్ అక్కినేని సీక్రెట్ స్పైగా మారుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అక్కినేని వారసుడు గూఢాచారిగా అదరగొట్టాడని ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థమవుతోంది. అఖిల్ కంటే ముందు ఆయన తండ్రి కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో ఏజెంట్ విక్రమ్ గా ఆకట్టుకున్నాడు.
అడవి శేష్, కళ్యాణ్ రామ్ అదే బాట
యంగ్ హీరో అడవి శేష్ కూడా ఏజెంట్ గా మెప్పించాడు. ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేష్.. ఇప్పుడు సీక్వెల్ గా ‘జీ2’గా రాబోతున్నాడు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ త్వరలో స్పై అనే యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్ సైతం ‘డెవిల్’ అనే చిత్రంతో వస్తున్నాడు. 1945లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.
‘విక్రమ్’లో కమల్ - ‘సర్దార్’లో కార్తి
1986లో 'ఏజెంట్ విక్రమ్ 007' సినిమాతో అలరించిన కమల్ హాసన్.. ఇన్నేళ్ల తర్వాత 'విక్రమ్'తో మరోసారి సీక్రెట్ ఏజెంట్ గా హిట్ కొట్టాడు. తమిళ హీరో కార్తీ కూడా ఆ మధ్య 'సర్దార్' సినిమాలో గూఢచారిగా కనిపించాడు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'సర్దార్ 2' తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్‌లోనూ ఏజెంట్ల సందడి
సిద్ధార్థ్ మల్హోత్రా సైతం 'మిషన్ మజ్నూ'తో RAW ఏజెంట్ గా మారాడు. అలానే ఇటీవల 'ముఖ్బీర్' అనే వెబ్ సిరీస్ లో గూఢచారుల లైఫ్ స్టోరీని చూపించారు. స్పై యూనివర్స్ ని సృష్టించిన యశ్ రాజ్ ఫిల్మ్స్.. 'పఠాన్' చిత్రంతో షారుక్ ఖాన్ ను రా ఏజెంట్ గా మార్చారు. ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో మరికొన్ని స్పై చిత్రాలను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో చేస్తున్న ‘టైగర్-3’ సెట్స్ మీద ఉంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లతో ‘వార్ 2’ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే భారీ చిత్రానికి ప్లాన్ చేయనున్నారు.
Raw ఏజెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే..
సినిమాలలో సీక్రెట్ ఏజెంట్స్ చేసే విన్యాసాలు చూసి, రియల్ లైఫ్ లోనూ గూఢచారులు అలాంటి సాహసాలు చేస్తారా? అనే సందేహాలు రావొచ్చు. నిజ జీవితంలో RAW ఏజెంట్స్ కాస్త భిన్నంగా ఉండొచ్చు కానీ, వాళ్ళు సినిమాలలో మాదిరిగానే ప్రాణాలను పణంగా పెట్టి, ఎంతో రిస్క్ చేస్తుంటారు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. తమ ప్రయోజనాల కంటే దేశ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తారు.
సాధారణంగా రాజకీయ, సైనిక సమాచారాన్ని పొందడం కోసం ప్రభుత్వాలు RAW ఏజెంట్లను ఉపయోగిస్తుంటారు. ఇతర దేశాల అంతర్గత రహస్యాలను తెలుసుకోవడం.. వారి సైనిక కార్యకలాపాలు, రాజకీయ నాయకుల గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా తమ దేశాన్ని రక్షించుకోవడం గూఢచారుల ప్రధాన ఉద్దేశ్యం. దీని కోసం వారు ఏళ్ళ తరబడి ఇతర దేశాల్లో మారు పేర్లతో జీవించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి అసలు పేర్లను కూడా ఎవరికీ వెల్లడించరు. వారి గురించిన సమాచారం ఎవరికీ అందుబాటులో ఉండదు.
ఏజెంట్లు తమ గుర్తింపును వారి కుటుంబ సభ్యులకు స్నేహితులకు కూడా పంచుకోలేరు. ఒకవేళ దేశం వెలుపల ఏదైనా ఆపరేషన్లో వారు అరెస్టు చేయబడినా, ఎప్పుడైనా వారి ఐడెంటిటీ బయటపడినా పరిస్థితులను బట్టి ప్రభుత్వం కూడా వారిని విస్మరించాల్సి వస్తుంది. అంతేకాదు విధి నిర్వహణలో చనిపోయినప్పుడు, వారికి సైనిక గౌరవాలు కానీ మెడల్స్ కానీ లభించవు.
‘ఏజెంట్’కు కావాల్సిన అర్హతలు
RAW ఏజెంట్ గా పని చేయడానికి ప్రధాన అర్హత వారు దేశ పౌరులై ఉండాలి. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండకూడదు.. డ్రగ్స్ కు బానిస కాకూడదు. ఉన్నత విద్యతో పాటుగా కనీసం ఒక విదేశీ భాషపై పట్టు సాధించాలి. అప్లికెంట్ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకూడదు.
మొదట్లో శిక్షణ పొందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను డైరెక్ట్ గా ఏజెంట్ లుగా తీసుకునేవారు. గూడాచారి పాత్ర విస్తరించిన తర్వాత మిలిటరీ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నుండి కూడా అభ్యర్థులను నియమించుకునేవారు. అయితే 1983 లో సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద గ్రూప్ A సివిల్ సర్వీసెస్ కోసం అభ్యర్థిని తీసుకోవడానికి RAW సొంతంగా ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సర్వీస్ (RAS)ని క్రియేట్ చేసుకుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లోని అన్ని దశలను క్లియర్ చేసిన టాప్ కాండిడేట్స్ ని RAW పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. వాళ్లకి 20 ఏళ్ల సర్వీసు అనుభవం కూడా ఉండాలి. ఇది పర్మినెంట్ జాబ్ కాదు. కానీ, నెలకు 80 వేల నుండి రూ. 1.3 లక్షల వరకు ఉంటుంది.
RAW ఏజెంట్ల శిక్షణ:
ఏజెంట్లకు రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది. వారికి బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో గూఢచర్యం, ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే, స్పేస్ టెక్నాలజీ, ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధన భద్రత, శాస్త్రీయ పరిజ్ఞానం, ఆర్థిక భౌగోళిక వ్యూహాత్మక విశ్లేషణ గురించి జ్ఞానాన్ని అందిస్తారు. CIA, ISI, MI6 మొదలైన ఇతర ఏజెన్సీల కొన్ని కేస్ స్టడీస్ ని చదివిస్తారు. ఆ తర్వాత ఫీల్డ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో శిక్షణ అందిస్తారు. సీక్రెట్ ఆపరేషన్స్ ఎలా చెయ్యాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఉండాలి వంటివి నేర్పుతారు. ఒకవేళ ఏజెంట్లు పట్టుబడినట్లయితే, విచారణను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి వివరిస్తారు. అన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన అభ్యర్ధులను RAW ఏజెంట్స్ గా రంగంలోకి దిగుతారు.
Writen By: Rajasekhar, ABP Desam Features
(గమనిక: ఇది ABP Desam Exclusive కంటెంట్. ఈ ఆర్టికల్‌ను కాపీ పేస్ట్ చేసినట్లయితే.. బాధ్యులపై కాపీ రైట్స్ చట్టం కింద చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు.)