యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ "ఏజెంట్''. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్ 28న తెలుగు మలయాళ భాషల్లో విడుదలకు సిద్దమైంది. అయితే మరో మూడు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రానికి 'విరూపాక్ష' రూపంలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష'. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ గత శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. ఫస్ట్ డేనే హిట్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే 44 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, ఫస్ట్ వీకెండ్ లోనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది. ట్రెండ్ చూస్తుంటే మరికొన్ని రోజులు థియేటర్లలో ఈ సినిమా సందడి కనిపించేలా ఉంది. అదే జరిగితే ఈ వారం విడుదల కాబోతున్న 'ఏజెంట్' మూవీ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. 

 

'ఏజెంట్' సినిమాపై అఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో సక్సెస్ రుచి చూసిన అక్కినేని వారసుడు.. ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ హీరోగా మారాలని ఆరాట పడుతున్నాడు. దీని కోసం ఎంత చెయ్యాలో అంతా చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా కోసం గత మూడేళ్లుగా తీవ్రంగా కష్టపడిన అఖిల్.. ఇప్పుడు ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాన వేసుకుని సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.

 

ఇప్పటికే 'ఏజెంట్' నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకటీ రెండు పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వైల్డ్ సాలే అనే స్పెషల్ ఐటెమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అఖిల్ ప్రమోషన్లను ముమ్మరం చేశాడు. వరుస పెట్టి ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. ఇదంతా సినిమాపై ట్రేడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ తెచ్చి పెడుతుందో చూడాలి.

 

కాగా, 'ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ , సరెండర్2సినిమా బ్యానర్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు 80 కోట్ల వరకూ ఖర్చూ అయిందని టాక్. ఇది అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చగా.. భీమ్స్ సిసిరిలియో ఒక సాంగ్ కంపోజ్ చేశాడు. రసూల్ ఏల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.